సిరిసిల్లలో అపెరల్ పార్క్ రెడీ.. రూ.60 కోట్లతో రెడీమేడ్​ దుస్తుల తయారీ యూనిట్

సిరిసిల్లలో అపెరల్ పార్క్ రెడీ.. రూ.60 కోట్లతో రెడీమేడ్​ దుస్తుల తయారీ యూనిట్
  • మోడ్రన్  టెక్నాలజీ కుట్టు మిషన్ల ఇన్​స్టాలేషన్
  • 500 మంది మహిళలకు శిక్షణ పూర్తి
  • వారం రోజుల్లో ఉత్పత్తి ప్రారంభం

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల జిల్లాలో అపెరల్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులు పూర్తి కావడంతో పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది మహిళలకు గార్మెంట్‌‌‌‌‌‌‌‌ రంగంలో ఉపాధి దొరకనుంది. ఈ పార్క్‌‌‌‌‌‌‌‌ పనులు ఏడాది కిందటే పూర్తయినా మెషినరీ ఫిట్టింగ్‌‌‌‌‌‌‌‌ పనులు ఇటీవలే కంప్లీట్​ కావడంతో మరో వారం రోజుల్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ పార్క్‌‌‌‌‌‌‌‌లో పని చేసేందుకు ఇప్పటికే 500 మంది మహిళలను రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేసుకోగా.. దశల వారీగా 2 వేల మందికి పెంచే అవకాశాలున్నాయి.

మెషీన్ల ఇన్​స్టాలేషన్​ పూర్తి..

జిల్లాలోని పెద్దూర్  గ్రామ శివారులో 7.5 ఎకరాల్లో 2022లో అపెరల్  పార్క్  నిర్మాణం చేపట్టారు. టీఎస్ఐఐసీ రూ.40 కోట్లతో పనులు ప్రారంభించింది. ఏడాది కింద పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం బెంగుళూరుకు చెందిన టెక్స్ పోర్ట్  కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ  కంపెనీతో వస్త్రోత్పత్తికి మూడేండ్ల అగ్రిమెంట్  చేసుకుంది. టెక్స్ పోర్టు అనుంబంధ కంపెనీ అయిన పంక్చుయేట్  కంపెనీ మెషీన్ల ఇన్​స్టాలేషన్ ను ఏడాది కింద ప్రారంభించింది. మెషినరీ ఇన్​స్టాలేషన్  కోసం రూ.60 కోట్ల పెట్టుబడి పెట్టారు. జపాన్, హాంగ్ కాంగ్, జూకీ కుట్టు మెషీన్లను అమర్చింది.

2 వేల మంది మహిళలకు ఉపాధి..

అపెరల్​ కంపెనీలో వస్త్ర ఉత్పత్తిని వారం రోజుల్లో ప్రారంభించనుంది. దీంతో సిరిసిల్ల పరిసర గ్రామాల మహిళలకు పని దొరకనుంది. ఇప్పటికే 500 మంది మహిళలను కంపెనీ రిక్రూట్  చేసుకుంది. ప్రతీ నెల మరో 500 మంది చొప్పున 2 వేల మంది దాకా రిక్రూట్  చేసుకునే అవకాశం ఉంది. ఆరు నెలల నుంచే కంపెనీలో పని చేసేందుకు మహిళల రిక్రూట్ మెంట్  ప్రారంభమైంది. కట్టు మిషన్  శిక్షణ తీసుకున్న మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

జీన్స్, టీ షర్ట్స్  ఉత్పత్తి..

సిరిసిల్ల అపెరల్  పార్క్ లో టెక్స్ పోర్ట్  కంపెనీ జీన్స్, టీ షర్ట్స్, ఉడ్డీస్  వంటి డ్రెస్​లను ఉత్పత్తి చేయనుంది. వీటికి సంబంధించిన యారన్ ను బెంగుళూరు నుంచి దిగుమతి చేసుకుంటారు. మార్కెట్ లో ట్రెండింగ్​లో ఉన్న దుస్తుల ఉత్పత్తిపై దృష్టి పెట్టడంతో మార్కెటింగ్  ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్  వంటి దేశాలకు ఇక్కడి నుంచి ప్రొడక్ట్స్​ ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే పెద్దూర్  శివారులో గోకుల్ దాస్ కు చెందిన గ్రీన్  నీడిల్  కంపెనీ రెండేండ్ల నుంచి ఉత్పత్తులు ప్రారంభించింది. 

500 మందికి ట్రైనింగ్  ఇచ్చాం..

వారం రోజుల్లో కంపెనీ ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే 500 మంది మహిళలను ఎంపిక చేసి ట్రైనింగ్  ఇచ్చాం. కంపెనీ ప్రాడక్ట్స్  పెరిగే కొద్దీ మహిళలను తీసుకుంటాం. ప్రతి నెలా 400 మంది మహిళలను రిక్రూట్  చేస్తాం. స్టిచ్చింగ్ పై అవగాహన ఉన్న మహిళలకు అవకాశం ఉంటుంది.
-మనోజ్ కుమార్,​ సీనియర్ 
 ట్రైనర్, ఎక్స్ పోర్టు కంపెనీ 

సూపర్ వైజర్  పోస్టుకు సెలక్ట్  అయ్యా..

నేను డిగ్రీ పూర్తి చేసి, జాబ్  కోసం వెతుకుతున్నాను. 
6 నెలల కింద టెక్స్ పోర్ట్  కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేసుకున్నా. కంపెనీలో సూపర్ వైజర్ గా సెలక్ట్  అయ్యాను. సొంత ఊరు పక్కనే ఉద్యోగం దొరకడం ఆనందంగా ఉంది. -వడ్డేపల్లి లావణ్య,పెద్దూర్