
- పెద్దూరు శివారులోని అపెరల్ పార్క్‌లో సిద్ధమైన టెక్స్‌పోర్ట్ యూనిట్
- నేడు ప్రారంభించనున్న మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, తుమ్మల, పొన్నం
- ఇప్పటికే వెయ్యి మందికి ట్రైనింగ్
రాజన్నసిరిసిల్ల, వెలుగు : ఇప్పటివరకు చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన సిరిసిల్ల నుంచి ఇక జీన్స్, టీషర్ట్స్, హుడీస్ ఉత్పత్తి కానున్నాయి. గార్మెంట్ రంగంలో మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసిన అపెరల్ పార్క్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ పార్క్‌లో టెక్స్‌పోర్ట్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడ్రన్ వస్త్రాల తయారీ యూనిట్ నేడు ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, తుమ్మల, పొన్నం హాజరుకానున్నారు.
2 వేల మంది మహిళలకు ఉపాధి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దూర్ శివారులో 7.5 ఎకరాల స్థలంలో అపెరల్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో రూ. 45 కోట్ల ఖర్చుతో అపెరల్ పార్క్‌ను నిర్మించారు. పార్క్‌లో పారిశ్రామిక షెడ్లు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించింది. బెంగళూరుకు చెందిన టెక్స్‌పోర్ట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని ఈ పార్క్‌లో మోడ్రన్ వస్త్రాలను ఉత్పత్తి చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ. 60 కోట్లతో భారీ సంఖ్యలో కుట్టు మెషీన్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఇతర సౌకర్యాలు కల్పించారు.
మోడ్రన్ వస్త్రాల తయారీ యూనిట్‌లో సుమారు 2 వేల మంది మహిళలకు ఉపాధి దొరకనుంది. టైలరింగ్‌పై అవగాహన ఉన్న మహిళల నుంచి అప్లికేషన్లు తీసుకొని సుమారు 1000 మందిని ఎంపిక చేశారు. వీరికి మోడ్రన్ వస్త్రాల తయారీలో ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. ప్రస్తుతం వెయ్యి మందితో ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీ... మరో వెయ్యి మంది నుంచి అప్లికేషన్లు తీసుకుంటోంది. రాబోయే మూడేండ్లలో మరికొందరు మహిళలకు సైతం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
పెద్దూర్ శివారులో గ్రీన్‌నిడిల్ అనే సంస్థ 500 మంది మహిళలతో రెండేండ్ల కిందే దుస్తుల ఉత్పత్తిని ప్రారంభించింది. తాజాగా టెక్స్‌పోర్ట్ కంపెనీ సైతం ప్రారంభం కాబోతుండడంతో సిరిసిల్ల, వేములవాడ పట్టణంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల మహిళలకు ఉపాధి దొరకనుంది.
ఇక్కడి నుంచే ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్
సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో టెక్స్‌పోర్ట్ కంపెనీ ఆధ్వర్యంలో మోడ్రన్ దుస్తులను తయారు చేయనున్నారు. జీన్స్, టీషర్ట్స్, హుడీస్ వంటి అధునాతన వస్త్రాలను ఉత్పత్తి చేయనున్నారు. ఈ వస్త్రాల కోసం బెంగుళూరు టెక్స్‌పోర్ట్ కంపెనీ నుంచే యారన్ సప్లై చేయనున్నారు. ఇక్కడ తయారు చేసే మోడ్రన్ దుస్తులను టామీ హిల్ఫిగర్, రాబర్ట్ గ్రాహం, వ్యాన్స్, మైఖేల్ కోర్స్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరా చేయనున్నారు. ప్రతి సంవత్సరం రూ. 300 కోట్ల విలువైన 70 లక్షల పీస్‌లను తయారు చేసి ఎక్స్‌పోర్ట్ చేయనున్నారు.
నేడు ప్రారంభించనున్న మంత్రులు
అపెరల్ పార్క్‌లోని టెక్స్‌పోర్ట్ కంపెనీలో మోడ్రన్ వస్త్రాల ఉత్పత్తి యూనిట్‌ను నేడు ప్రారంభించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు యూనిట్ ప్రారంభం కానుంది. అనంతరం ఉద్యోగాలు పొందిన మహిళలకు మంత్రులు నియామక పత్రాలు అందజేస్తారు.
యూనిట్ ప్రారంభ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై గురువారం సెక్రటేరియట్‌లో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఇతర ఆఫీసర్లతో రివ్యూ చేశారు.
కంపెనీతో మహిళలకు ఉపాధి
సిరిసిల్లలో టెక్స్‌పోర్ట్ కంపెనీ ప్రారంభంతో మహిళలకు ఉపాధి లభించనుంది. ఈ కంపెనీ మోడ్రన్ దుస్తులను ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయనుంది. టెక్స్‌పోర్ట్ కంపెనీతో ప్రభుత్వం, జౌళి శాఖ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిరిసిల్ల పరిసర గ్రామాల మహిళలకు ఇది మంచి అవకాశం.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా