సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేయండి .. గ్రూపు-1 అభ్యర్థుల అప్పీలు

సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేయండి .. గ్రూపు-1 అభ్యర్థుల అప్పీలు
  • హైకోర్టులో గ్రూపు-1 అభ్యర్థుల అప్పీలు
  • నేడు విచారణకు వచ్చే అవకాశం

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రద్దుకు నిరాకరిస్తూ సింగిల్‌ జడ్జి ఈ నెల 15న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు గురువారం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్‌ జడ్జి తీర్పుతోపాటు ప్రాథమిక పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ప్రిలిమ్స్‌ పరీక్ష కీలో తప్పులున్నందున పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించేలా ఆదేశించాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తూ సింగిల్‌ జడ్జి 15న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జి.దామోదర్‌రెడ్డి తదితరులు హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. 

తప్పుడు సమాధానాలతో కూడిన తుది కీ ఆధారంగా నిర్వహించి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల వల్ల ఎంపికపై ప్రభావం పడుతుందన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన తుది కీలో తప్పులున్నాయంటూ ఆధారాలతో సహా వినిపించినా తమ వాదనలను పట్టించుకోలేదన్నారు. ప్రశ్నకు ఐచ్ఛిక సమాధానాల్లో సరైనది లేనప్పుడు ఆ ప్రశ్నను తప్పుగా రూపొందించినట్టు పరిగణించాల్సి ఉందన్నారు. సరైన సమాధానం లేకపోయినప్పటికీ ఉన్నవాటిలో దగ్గరిగా ఉన్న సమాధానాన్ని పేర్కొనాలన్న కమిషన్‌ వాదనతో సింగిల్‌ జడ్జి ఏకీభవించడం సరికాదన్నారు. 

కేవలం ఒక్క పిటిషనర్​ లేవనెత్తిన అభ్యంతరాలనే పరిగణనలోకి తీసుకుంటామనడం చట్టవిరుద్ధమన్నారు. 41, 119 ప్రశ్నలను పరిశీలిస్తే తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేవని, ఈ రెండు ప్రశ్నలను తొలగించడం వల్ల మెరిట్‌ జాబితాపై ప్రభావం పడుతుందన్నారు. ఇలాంటి కీ ద్వారా మెయిన్స్‌కు అభ్యర్థుల జాబితా రూపొందించడం సరికాదన్నారు. ప్రాథమిక పరీక్ష ఒక్కటే ఎంపికకు ప్రామాణికం కాదని సింగిల్‌ జడ్జి పేర్కొనడం సరికాదని, అభ్యర్థుల వడపోతకు ప్రాథమిక పరీక్షే ప్రధానమని పేర్కొన్నారు. గతంలో ప్రిలిమ్స్​ నిర్వహణలో తప్పులు జరిగాయనే రెండు సార్లు పరీక్షను రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరారు.