దయచేసి మీరే ఆదుకోవాలి.. దుబాయ్ నుంచి తెలంగాణ యువకుడి విజ్ఞప్తి

ఆర్టీసీలో కారుణ్య నియామకం కోసం పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని దుబాయ్ నుంచి తెలంగాణ యువకుడి విజ్ఞప్తి చేశాడు. తనకు ఇన్ని రోజులు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తనను ఆదుకోవాలని వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

జగిత్యాల అర్బన్ మండలం హుస్నాబాద్ కు చెందిన రాగుల వెంకటేష్ తండ్రి మల్లయ్య జగిత్యాల ఆర్టీసీ డిపోలో పని చేసేవాడని.. గత కొన్ని సంవత్సరాల క్రితం బస్సు రిపేర్ చేస్తుండగా.. బలమైన రాడ్డు కాళ్లపై పడి తీవ్ర గాయామైందని.. అప్పటి నుంచి మెట్ పల్లి, మంథని డిపోల్లో కొనసాగాడని చెప్పాడు. అయితే మంథని డిపో మేనేజర్ సూచన మేరకు కరీంనగర్ లో వైద్య పరీక్షల కోసం వెళ్లగా నీవు ఉద్యోగం చేయడానికి పనికి రావని వైద్యులు చెప్పారని వివరించాడు. ఈ క్రమంలో కాలికి అయిన గాయం విషంగా మారి మల్లయ్య మృతి చెందాడని.. అయితే మల్లయ్య కుమారుడైన తనకు ఆర్టీసీలో కారుణ్య నియామకం కోసం 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోవడంతో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లానని వెంకటేష్ తెలిపాడు.

రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పటికైనా తనకు ఆర్టీసీలో కారుణ్య నియామక ప్రక్రియ కింద ఉద్యోగం ఇప్పించాలని దుబాయ్ నుంచి వెంకటేష్  వీడియో రూపంలో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.