-
మాకు ఈ జన్మలో గ్రీన్ కార్డు రాదు
-
వెయిటింగ్ పీరియడ్ 80 ఏండ్లు ఉంది: ఎన్నారైలు
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి 1996లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. చదువు పూర్తిచేసుకుని న్యూజెర్సీలో ఉద్యోగం చేస్తున్నారు. 2005లో ఆయన గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. ఇప్పుడాయన వెయిటింగ్ టైమ్ 81 సంవత్సరాలు. ఇప్పటికే ఆయన వయసు 53 ఏండ్లు. గ్రీన్ కార్డు వచ్చేనాటికి ఆయన బతికి ఉంటారో లేదో తెలియదు. ఇదీ అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైల పరిస్థితి. గ్రీన్ కార్డు పొందడం వారికి అందని ద్రాక్షగా మారింది. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారిలో చాలామంది వెయిటింగ్ పీరియడ్ 80 నుంచి 100 ఏండ్లుగా ఉంది.
గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ కు 2 సంవత్సరాలు పడుతుందని ఓవైపు అమెరికా బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ అధికారులు చెబుతుంటే.. అది నిజం కాదని, 40 నుంచి 100 సంవత్సరాలు పడుతుందని ఎన్నారైలు తెలిపారు. ‘‘దశాబ్దాలుగా ఎలిజిబిల్ వీసాతో అమెరికాలో నివసిస్తున్నాం. ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. గ్రీన్ కార్డుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. అయినా.. వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉంది” అని ఎన్నారైలు ఓ మీడియా సంస్థతో ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదో ఒక సాకు చెప్పి నిరాకరిస్తున్నారు
గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్న ఎన్నారైలకు అధికారులు ఏదో ఓ సాకు చెప్పి నిరాకరిస్తున్నారు. ‘‘ఇమిగ్రేషన్ అధికారులను సంప్రదించిన ప్రతీసారి అప్లికేషన్లు భారీ సంఖ్యలో ఉన్నాయనే చెబుతున్నారు. దీంతో వెయిటింగ్ పీరియడ్ పెరుగుతోందని అంటున్నారు” అని ఓ ఎన్నారై తెలిపారు. కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు గ్రీన్ కార్డుల కోసం 3.47 కోట్ల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 3% మందికే గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉందని కాటో ఇన్ స్టిట్యూట్ అనే మేధో సంస్థ తెలిపింది. మరోవైపు, అమెరికాకు రావొద్దంటూ డాలస్లో నివసించే ఐటీ ప్రొఫెషనల్ సురెన్.కె ఇండియన్ స్టూడెంట్లకు సూచిస్తున్నారు. అమెరికా అధికారులు చెప్పేది అబద్ధమన్నారు. తన మాట మీద నమ్మకం లేకపోతే, గత దశాబ్దంలో చదువుకోవడానికి వచ్చిన వారిని అడగాలన్నారు.
గ్రీన్ కార్డు ఇవ్వనపుడుఎందుకు ఆహ్వానిస్తారు?
గ్రీన్ కార్డు కోసం వెయిటింగ్ పీరియడ్ లో ఉన్న ఎన్నారైలు అమెరికా బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. 2010లో నాగ్ పూర్ నుంచి అమెరికా వెళ్లిన ఓ ఎన్నారై వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం 62 ఏండ్లుగా ఉంది. ఓ ఐటీ దిగ్గజ కంపెనీలో పనిచేస్తూనే గత దశాబ్ద కాలంగా ఆయన గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.
‘‘ప్రస్తుతం నా వయసు 40 ఏండ్లు. గ్రీన్ కార్డు వెయిటింగ్ పీరియడ్ 62 ఏండ్లు. నాకు ఎలాంటి నేరచరిత్ర లేదు. గ్రీన్ కార్డు పొందడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నాకు గ్రీన్ కార్డు వచ్చేటప్పటికి నేను బతికి ఉంటానో లేదో తెలీదు. అప్పుడు గ్రీన్ కార్డు వచ్చినా లాభం లేదు” అని ఆ ఎన్నారై తెలిపాడు.