
గ్రూప్ 1 పరీక్షల పై దాఖలైన అప్పీల్ పిటిషన్లపై సింగిల్ బెంచ్ మళ్ళీ విచారణ జరపాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. వేసవి సెలవుల ముందే గ్రూప్ 1 వివాదంపై తుది ఆదేశాలు ఇవ్వాలని సింగిల్ బెంచ్ కు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
గ్రూప్ 1 అభ్యర్థుల నియామకంపై ఇప్పటికే స్టే విధించిన సింగిల్ బెంచ్.. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని గతంలో టీజీపీఎస్సీని ఆదేశించింది. దీనిపై బుధవారం విచారణలో భాగంగా.. ఈ పిటిషన్లపై మళ్లీ విచారణ జరపాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది.
తెలంగాణలో తొలిసారిగా 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అప్పటి ప్రభుత్వం. 503 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది . 2022అక్టోబర్, 2023 ఆగస్టులో రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. ఒకసారి ప్రశ్నాపత్రం లీకేజీతో ప్రిలిమినరీ ఎగ్జామ్ రద్దు చేయగా..రెండోసారి బయోమెట్రిక్ తీసుకోని కారణంగా ఎగ్జామ్ ను రద్దు చేశారు. 2024 ఫిబ్రవరి 19న 563 పోస్టులతో రేవంత్ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది.
అయితే గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు తెలంగాణ హైకోర్టులో దాదాపు 20 పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 17న విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసు విచారణ పూర్తి అయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ పిటిషన్లపై సింగిల్ బెంచ్ మళ్లీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఇవాళ (ఏప్రిల్ 30) ఆదేశించడం గమనార్హం.