- మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో నల్గొండ నుంచే మొదలైన మంతనాలు
- పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు మానుకోవాలని సూచనలు
- పిల్లి రామరాజు యాదవ్ తో మినిస్టర్ భేటీ
- త్వరలో మరో ఐదు నియోజక వర్గాల లీడర్లతో సమావేశం
నల్గొండ, వెలుగు : బీఆర్ఎస్లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఎన్నికలకు ఐదారు నెలల ముందు నుంచే సొంత పార్టీలోని అసంతృప్తులను చల్లార్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గాల వారీగా అసంతృప్త లీడర్లతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే నల్గొండలో ప్రారంభమైంది.
పిల్లి రామరాజుతో మంత్రి భేటీ..
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు, కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్‌తో మంత్రి జగ దీశ్‌రెడ్డి చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం హైదరాబాద్‌లో రామరాజు తిరుగుబాటు వ్యవహారం గురించి మంత్రి చర్చించారు. పార్టీ లాయలిస్ట్‌గా ఉన్న తన పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు, తనకు జరిగిన అవమానాల గురించి రామరాజు మంత్రికి వివరించా రు.
పార్టీ లీడర్ల సమక్షంలోనే తన పట్ల ఎమ్మెల్యే అమర్యాదగా ప్రవర్తించాడని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురికావాల్సి వచ్చిందని మంత్రి ఎదుట తన ఆవేదన వెళ్లగక్కినట్లు తెలిసింది. దీని పైన స్పందించిన మంత్రి పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ చర్చల ద్వారా పరిష్కరించుకో వాలే తప్ప వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడొద్దని నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేతో చర్చించి, మరోసారి ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూస్తానని రామరాజుకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.
ఇంతటితో సద్ధుమణిగేనా..?
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టుదలతో రామరాజు కొంత కాలంగా మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫొటోలు పెట్టుకుని నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో ఆయనను పట్టణ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. దీన్ని మరింత అవమానంగా భావించిన రామరాజు ఇంకింత పట్టుదలతో ఏకంగా నల్గొండ టౌన్లో వాల్ రైటింగ్స్, పెద్ద పోస్టర్లు అతికించారు.
దీనికి పోటీగా ఎమ్మెల్యే వర్గం నల్గొండ డెవలప్మెంట్ ఫొటోల తో కూడిన పోస్టర్లను గోడల పైన అతికించారు. వీరిద్దరి మధ్య వివాదాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని భావించిన మంత్రి చివరకు జోక్యం చేసుకో వాల్సి వచ్చింది. మరి ఇంతటితో సద్ధుమణుగుతుందేమో వేచిచూడాలి. అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ వర్గం నేతలతో కూడా మంత్రి త్వరలో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయని పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.
ఆత్మీయ సమ్మేళనాలతో రచ్చకెక్కుతున్న విభేదాలు...
ఉమ్మడి జిల్లాలో పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు ఆత్మీయ సమ్మేళనాల్లో రచ్చకెక్కుతున్నాయి. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారెవ్వరూ సమ్మేళనాల్లో పాల్గొనడం లేదు. పైగా పలు చోట్ల నిరసన తెలుపుతున్నారు. నకిరేకల్, నాగార్జునసాగర్, కోదాడ, హుజూర్న గర్, దేవరకొండ నియోజకవర్గాల్లో విభేదాలు బయటపడుతున్నాయి. వీటివెనక పార్టీలోని పలువురు కీలక నేతల ప్రమేయం ఉన్నట్లు పార్టీ హైక మాండ్‌కు రిపోర్ట్ వెళ్లింది.
సమ్మేళనాల నిర్వహణ తీరు గురించి ఇంటిలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు రిపోర్ట్ సేకరిస్తున్నాయి. నకిరేకల్‌లో ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మల్యే వేముల వీరేశం వర్గం, దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ వ్యతిరేకంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి వర్గం, నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే భగత్ వర్సెస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి, కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, కన్మంత శశిధర్ రెడ్డి వర్గాలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి.
హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి వ్యతిరేకంగా గరిడేపల్లి, నేరేడుచర్ల, మేళ్లచెర్వు మండలాల్లో పార్టీలో గొడవలు పతాక స్థాయికి చేరాయి. ఎన్నికల హడావుడి మొదలయ్యే నాటికి నియోజకవర్గాల్లో పార్టీకి సానుకూల వాతావరణం కనిపించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిన నేపథ్యంలో ఆ బాధ్యతలు మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించినట్లు పార్టీ సీనియర్నాయుడొకరు చెప్పారు.