
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఎయిర్‌పాడ్స్‌ను తయారు చేయాలని యాపిల్ చూస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రొడక్షన్ మొదలవ్వొచ్చని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ ఎయిర్‌పాడ్స్‌ను లోకల్ మార్కెట్ కోసం కాకుండా ఎగుమతుల కోసం తయారు చేయనున్నారు. యాపిల్ ప్రస్తుతం ఐఫోన్లనే ఇండియాలో తయారు చేస్తోంది.
ఫాక్స్‌కాన్ రూ.3,500 కోట్లతో హైదరాబాద్‌లో ప్లాంట్ నిర్మిస్తోంది. బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ కెనలిస్ రిపోర్ట్ ప్రకారం,ఇండియాలో యాపిల్‌కు 2024 లో 23.1 శాతం మార్కెట్ వాటా దక్కింది. శామ్‌సంగ్ మార్కెట్ వాటా 8.5 శాతం కంటే మూడు రెట్లు ఎక్కువ. యూఎస్ పరస్పర టారిఫ్‌లు వేస్తామని ప్రకటించిన తర్వాత ఇండియాలో యాపిల్ ప్రొడక్షన్ తగ్గుతుందనే రూమర్లు చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం ఇయర్‌ఫోన్లు, వాచ్‌లు వంటి హియరబుల్స్, వియరబుల్స్‌పై ఇండియా 20 శాతం కస్టమ్స్ డ్యూటీ వేస్తోంది. అదే యూఎస్ ఎటువంటి టారిఫ్ వేయడం లేదు. ఒకవేళ ట్రంప్ పరస్పర టారిఫ్ వేస్తే ఇండియా నుంచి యూఎస్‌కు ఎగుమతి అయ్యే ఎయిర్‌పాడ్స్‌పై 20 శాతం టారిఫ్ పడుతుంది.