ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు సుబ్బారావు అంటే.. కొంత మంది మాత్రం దీన్ని రివర్స్ చేస్తున్నారు ఈ కాలంలో.. ఈ భూమిపైనే అత్యంత విలువైన కంపెనీగా ఉన్న యాపిల్ జరిగిన విరాళాలా స్కాంలో తెలుగోళ్లు ఉండటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఫండ్స్ (CSR) నిధుల దుర్వినియోగంలో తెలుగోళ్లు ఉన్నారనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పటికే 50 మంది ఉద్యోగులను తొలగించిన యాపిల్ కంపెనీ.. ఏడుగురిపై కేసు నమోదు చేసింది. అధికారికంగా యాపిల్ కంపెనీ ఈ విషయంపై ప్రకటన చేయనప్పటికీ.. నమోదైన కేసు ఆధారంగా వివరాలు బయటకు వచ్చాయి.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ.. సామాజిక బాధ్యత కింద ప్రపంచ వ్యాప్తంగా కొన్ని స్వచ్చంధ సంస్థలకు గ్రాంట్ ఇస్తుంది. ఈ గ్రాంట్ కింద డబ్బులు తీసుకునే స్వచ్చంధ సంస్థలు పేద పిల్లలకు స్కాలర్ షిప్ లు, ఉచితంగా చదవు, విద్య, వైద్యం వంటి సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది. కంపెనీలోని కొందరు ఉద్యోగులు.. కొన్ని స్వచ్ఛంధ సంస్థలకు నిధులను విడుదల చేశారు. అయితే ఈ సంస్థలు అన్నీ నకిలీవి. ఆయా స్వచ్చంధ సంస్థల నుంచి తిరిగి ఉద్యోగులు ఆ డబ్బులు తీసుకునేవారు. ఈ విధంగా మూడేళ్లలో ఒక లక్షా 52 వేల డాలర్లు ఉద్యోగుల ఖాతాల్లోకి తిరిగి వచ్చాయి. యాపిల్ సంస్థ నుంచి విరాళాలు తీసుకున్న స్వచ్చంధ సంస్థల్లో అమెరికాలోని తెలుగు అసోసియేషన్స్ కూడా ఉన్నాయి.
అర్హత లేని స్వచ్చంధ సంస్థలకు యాపిల్ కంపెనీ నుంచి విరాళాలు ఇప్పించి.. తిరిగి ఆ డబ్బులను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకునేవారు. ఉద్యోగులతో స్వచ్చంధ సంస్థలు కుమ్మక్కు అయ్యి ఈ వ్యవహారం నడిపించినట్లు యాపిల్ కంపెనీ నిర్థారించింది. ఇందులో కొన్ని భారతీయ సంస్థలు ఉండగా.. అందులో తెలుగు అసోసియేషన్స్ ఉండటం చర్చనీయాంశం అయ్యింది.
ALSO READ | ఇస్రో కొత్త చైర్మన్గా వి.నారాయణన్
యాపిల్ కంపెనీ విరాళాల స్కాంలో ఇప్పటికే అలెక్స్, హేసన్, సన్నీ, విక్టర్, లిచావో, జెంగ్ చాంగ్ అనే ఉద్యోగులను తొలగించింది. యాపిల్ తొలగించిన 50 మందిలో తెలుగు ఉద్యోగులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి పేర్లు మాత్రం వెల్లడి కాలేదు. వీళ్లకు తెలుగు అసోసియేషన్స్, కమ్యూనిటీలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. విరాళాలను కొట్టేసిన యాపిల్ ఉద్యోగులు.. ఆ నిధులకు సంబంధించి ఐటీ రిటర్న్స్ కూడా దాఖలు చేసి.. కాలిఫోర్నియా రాష్ట్రాన్ని సైతం మోసం చేసినట్లు కేసు నడుస్తోంది.
తమ కంపెనీలో జరిగిన CSR స్కాంపై యాపిల్ సంస్థ సీరియస్ గా అంతర్గత విచారణ చేస్తుంది. నిధులను తప్పుదారి పట్టించటం.. సొంతానికి వాడుకోవటానికి.. మోసం చేయటం.. దుర్వినియోగం చేయటం వంటి అంశాలపై విచారణ చేస్తుంది. ఈ స్కాంలో భారతీయులు అందులోనూ తెలుగోళ్లతోపాటు మిగతా దేశాలకు చెందిన కొంత మంది ఉద్యోగులు కూడా ఉన్నారు.