ఐఫోన్లకు ఇండియా అడ్డా.. చైనా నుంచి ఇండియాకు షిఫ్ట్ అవుతున్న యాపిల్‌‌‌‌

ఐఫోన్లకు ఇండియా అడ్డా.. చైనా నుంచి ఇండియాకు షిఫ్ట్ అవుతున్న యాపిల్‌‌‌‌
  • తయారీ సామర్ధ్యాన్ని  చైనా నుంచి మన దేశానికి షిఫ్ట్ చేస్తున్న యాపిల్‌‌‌‌
  • 2024–25 లో సుమారు  రూ.1.90 లక్షల కోట్ల ఐఫోన్ల తయారీ
  • ఇందులో సుమారు రూ.1.50 లక్షల కోట్ల ఫోన్లు ఎగుమతి అయ్యాయి
  • చైనాతో పోలిస్తే  ఇండియా ఫోన్ల ఎగుమతిపై 20 శాతం తక్కువ ట్రంప్‌ టారిఫ్‌‌‌‌
  • ఐఫోన్ల తయారీ మరింత పెరిగే ఛాన్స్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియాలో ఐఫోన్ల తయారీని పెంచాలని యాపిల్ చూస్తోంది. యూఎస్‌‌‌‌, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండడంతో తన ప్రొడక్షన్‌‌‌‌ను పెద్ద మొత్తంలో చైనా నుంచి షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో 22 బిలియన్ డాలర్ల(రూ.1.90 లక్షల కోట్ల)  విలువైన ఐఫోన్లను ఇండియాలో ఉత్పత్తి చేసింది.  అంటే గ్లోబల్‌‌‌‌గా తయారవుతున్న ఐఫోన్లలో 20 శాతం ఇండియాలోనే తయారయ్యాయి.  

కరోనా  లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ల కారణంగా 2020 లో చైనాలో యాపిల్ ప్రొడక్షన్ భారీగా పడిపోయింది. ఆ తర్వాతనే  కంపెనీ తన ప్రొడక్షన్ కెపాసిటీని ఇతర దేశాలకు షిఫ్ట్ చేయాలని నిర్ణయించుకుంది.  ప్రస్తుతం  సౌత్ ఇండియాలో యాపిల్ ఫోన్లు తయారవుతున్నాయి.  ఫాక్స్‌‌‌‌కాన్, టాటా గ్రూప్ కంపెనీ ఫోన్లను తయారు చేస్తున్నాయి. 

ఇండియాపై  టారిఫ్ లేకపోవడంతో మేలు 

ఇండియా నుంచి యూఎస్‌‌‌‌కు ఎగుమతి అయ్యే  స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లు, ఐఫోన్‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, టాబ్లెట్‌‌‌‌లపై ట్రంప్ ప్రభుత్వం  టారిఫ్‌‌‌‌లు వేయడం లేదు.   చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌‌‌‌కు తాజాగా టారిఫ్‌‌‌‌ల నుంచి మినహాయింపు ఇచ్చినా, వీటిపై ఇంకా 20 శాతం సుంకం పడుతోంది.   వియత్నాం నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్‌‌‌‌ వస్తువులకు కూడా టారిఫ్‌‌‌‌ల నుంచి ట్రంప్ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీంతో శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ లాభపడనుంది. 

" చైనా ఇప్పటికీ ఐఫోన్‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, టాబ్లెట్‌‌‌‌లు, వాచ్‌‌‌‌లు వంటి ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌‌‌‌పై  20 శాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది.  చైనాపై వేసిన ప్రతీకార టారిఫ్‌‌‌‌ను మాత్రమే యూఎస్ తొలగించింది.  ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే  ఐఫోన్‌‌‌‌లు,  అన్ని స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, టాబ్లెట్‌‌‌‌లపై సున్నా టారిఫ్‌‌‌‌ పడుతుంది. వియత్నాం కూడా సామ్‌‌‌‌సంగ్,  ఇతర స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, టాబ్లెట్‌‌‌‌లను  ఎటువంటి టారిఫ్‌‌‌‌ లేకుండా ఎగుమతి చేయగలుగుతుంది. 

ఈ విషయంలో ఇండియా, వియత్నాం ఒకే పొజిషన్‌‌‌‌లో ఉన్నాయి. ఈ  రెండూ దేశాలు కూడా లాభపడనున్నాయి" అని ఇండియా సెల్యూలర్‌‌‌‌‌‌‌‌ అండ్ ఎలక్ట్రానిక్స్‌‌‌‌ అసోసియేషన్ (ఐసీఈఏ)  చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. కాగా, 2024–-25లో ఇండియా నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు రూ. 2 లక్షల కోట్ల ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిని దాటాయి.  ఇది 2023–-24లో నమోదైన రూ. 1.29 లక్షల కోట్లతో పోలిస్తే 55 శాతం  ఎక్కువ. ఒక్క  ఐఫోన్‌‌‌‌ ఎగుమతులే  రూ. 1.5 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి.

పెరుగుతున్న  ఎగుమతులు..

ప్రభుత్వ డేటా ప్రకారం,  2024–25 ఆర్థిక సంవత్సరంలో 17.4 బిలియన్‌ డాలర్ల విలువైన ఫోన్లను యాపిల్ ఎగుమతి చేసింది. చైనా, ఇండియాతో సహా చాలా దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్‌‌‌‌ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌‌‌‌లను వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యాపిల్ తన ఎగుమతులను ఇండియా నుంచి పెంచింది. 

కంపెనీ గత నాలుగు నెలల్లో 600 టన్నుల ఐఫోన్లను చెన్నై  ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ నుంచి  అమెరికాకు ఎగుమతి చేసిందని అంచనా.  యాపిల్ కూడా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకుటోంది. ఇప్పటికే  కొంత తయారీ సామర్ధ్యాన్ని చైనా నుంచి ఇండియాకు  మార్చింది.  దీనికి తోడు ప్రభుత్వం కూడా పీఎల్‌‌‌‌ఐ కింద  2.7 బిలియన్ డాలర్ల (రూ.23 వేల కోట్ల) విలువైన రాయితీలను ఇస్తుండడంతో ఇక్కడ తయారీని పెంచుతోంది.