యాపిల్​ మడతడిపోద్ది

యాపిల్​ మడతడిపోద్ది

ఫోల్డబుల్​, మల్టీ ఫోల్డబుల్​ ఫోన్లపై పేటెంట్​కు దరఖాస్తు

మడతబెట్టే ఫోన్లు ఇప్పుడో ట్రెండ్​. ఆమధ్య శాంసంగ్​ గెలాక్సీ ఫోల్డ్​ పేరిట మడతబెట్టే ఫోన్లను తీసుకొచ్చింది. అంతకన్నా ముందే.. హువావీ మేట్​ ఎక్స్​ 11ను పరిచయం చేసింది. గూగుల్​, సోనీలూ ఆ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా యాపిల్​ కూడా ఫోల్డింగ్​ ఫోన్లపై దృష్టి పెట్టినట్టుంది. అవసరమైతే ట్యాబ్​లా లేకపోతే ఫోన్​లా వాడే  ఫోల్డింగ్​ ఫోన్​, మల్టీ ఫోల్డబుల్​ ఫోన్లను తయారు చేసింది. దానిపై పేటెంట్​కు దరఖాస్తు చేసుకుంది. 37 బొమ్మలతో తన టెక్నాలజీని వివరిస్తూ పేటెంట్​కు అప్లై చేసింది. తాము తయారు చేస్తున్న ఫోల్డింగ్​ ఫోన్లు ఎలా పనిచేస్తాయో వివరించింది.

180 డిగ్రీలు, 90 డిగ్రీల కోణంలో ఫోన్​ను రెండువైపులా మలచుకోవచ్చట. మల్టీఫోల్డింగ్​ ఫోన్లను మలిచినప్పుడు అవి పాడుకాకుండా ఉండేలా సిరామిక్​ లేయర్​ ఉంటుందని యాపిల్​ తన పేటెంట్​ వెబ్​సైట్​ పేటెంట్లీలో పేర్కొంది. ఈ లేయరే ఫోన్​ నిర్మాణం చెడిపోకుండా చూస్తుందని చెప్పింది. కేవలం ఐఫోన్​ల వరకే పరిమితం కాకుండా ఐప్యాడ్​ మ్యాక్​బుక్​, యాపిల్​ వాచ్​లనూ ఫోల్డింగ్​ టెక్నాలజీతో తయారు చేస్తున్నట్టు యాపిల్​ పేర్కొంది. వాటికి సంబంధించిన డిజైన్లను వెబ్​సైట్​లో పెట్టింది. గత ఏడాది అక్టోబర్​ 12నే ‘ఫ్లెగ్జిబుల్​ డిస్​ఫ్లే డివైజ్​’ పేరిట యాపిల్​ ఓ పేటెంట్​కు దరఖాస్తు చేసుకుంది. తాజాగా ఇంకో పేటెంట్‌కు అప్లై చేసింది.

ఐట్యూన్స్​ అవుట్​!

యాపిల్​ ఐఫోన్​ అనగానే ముందు గుర్తొచ్చేది ఐట్యూన్స్​. మ్యూజిక్​లో అది ఒక రెవల్యూషన్​నే తెచ్చింది. 2001 జనవరి 9న నాటి కంపెనీ సీఈవో స్టీవ్​ జాబ్స్​ దానిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత ఆ ఐట్యూన్స్​కు బైబై చెప్పబోతోంది సంస్థ. సోమవారం జరిగే డెవలపర్​ కాన్ఫరెన్స్​లో ఐట్యూన్స్​ను తీసేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించబోతోంది. దాని స్థానంలో యాపిల్​ మ్యూజిక్​, యాపిల్​ టీవీ, పాడ్​కాస్ట్స్​ను తీసుకొస్తుందంటున్నారు. ఐట్యూన్స్‌‌ను ఎందుకు తీసేస్తున్నారన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.