ముంబై : ఐడీసీ తాజా రిపోర్టు ప్రకారం పర్సనల్ కంప్యూటర్ల షిప్మెంట్లు 29 శాతం పడిపోయి 56.9 మిలియన్ యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ దెబ్బ యాపిల్‌కు గట్టిగా తగిలిందని, ఆ కంపెనీ షిప్మెంట్లు 40.5 శాతం తగ్గిపోయాయని ఐడీసీ రిపోర్టు వెల్లడించింది. అమ్మకం కాని నిల్వలతో పీసీ తయారీ కంపెనీలు సతమతమవుతున్నాయని పేర్కొంది. 2019 తర్వాత పీసీ షిప్మెంట్లు ఇంతలా తగ్గడం మళ్లీ 2023 మొదటి క్వార్టర్లోనే చూస్తున్నామని వివరించింది. కరోనా టైములో రిమోట్‌గా పనిచేయడం వల్ల కంప్యూటర్లకు డిమాండ్ పెరిగిందని, ఇప్పుడు ఆ డిమాండ్ కనుమరుగయిందని ఐడీసీ రిపోర్టు తెలిపింది.
మార్కెట్ లీడర్లయిన లినోవో, డెల్, హెచ్‌పీల షిప్మెంట్లు 24 శాతం పైనే తగ్గినట్లు పేర్కొంది. అసూస్ కంప్యూటర్ షిప్మెంట్లు కూడా 30.3 శాతం పడిపోయినట్లు వివరించింది. ఇండస్ట్రీలోని అన్ని పెద్ద బ్రాండ్లదీ ఇదే పరిస్థితని ఐడీసీ రిపోర్టు పేర్కొంది. భారీ డిస్కౌంట్లు ఇచ్చినా కూడా ఇన్వెంటరీని కంపెనీలు వెంటనే తగ్గించుకోలేకపోవచ్చని ఐడీసీ రీసెర్చ్ మేనేజర్ జితేష్ ఉబ్రాని చెప్పారు. తయారీని చైనా నుంచి బయటకు మారుద్దామనుకుంటున్న తయారీదారులకు షిప్మెంట్ల తగ్గుదల మంచి అవకాశమిస్తోందని ఐడీసీ రిపోర్టు తెలిపింది. దశలవారీగా యాపిల్ తన తయారీని చైనా నుంచి ఇతర దేశాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే.