- యాపిల్ కంపెనీ ప్రకటన
- వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి’ డేటా దుర్వినియోగం ఆరోపణలపై స్పందన
న్యూయార్క్: తమ వర్చువల్ అసిస్టెంట్ ‘ సిరి’ రికార్డ్ చేసిన డేటాను అడ్వర్టైజర్లకు విక్రయించలేదని ప్రపంచ నంబర్ వన్ సంస్థ యాపిల్ స్పష్టం చేసింది. తాము ఈ డేటాను దుర్వినియోగం చేయలేదని పేర్కొన్నది.
యాపిల్ స్పైగా ‘సిరి’ పనిచేస్తున్నదంటూ అమెరికా ఫెడరల్కోర్టులో దావా దాఖలైన విషయం తెలిసిందే. దీన్ని పరిష్కరించుకునేందుకు రూ. 814 కోట్లు (95 మిలియన్ల అమెరికా డాలర్లు) చెల్లించేందుకు అంగీకరించిన యాపిల్.. ఆ తర్వాత ‘సిరి’ పనితీరు, యూజర్ల భద్రతా విధానాలను వివరిస్తూ బ్లాగ్ స్పాట్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.
యాపిల్ వినియోగదారుల డేటాను రక్షించేందుకు కంపెనీ కట్టుబడి ఉన్నదని తెలిపింది. తమ అన్ని ప్రొడక్ట్స్ ఒకే ఫౌండేషన్‌పై నిర్మితమై ఉంటాయని పేర్కొన్నది. ‘‘మార్కెటింగ్ ప్రొఫైల్స్ రూపొందించేందుకు సిరి డేటాను వినియోగించలేదు. ఏ ప్రయోజనం కోసమూ ఎవరికీ దాన్ని విక్రయించలేదు.
సిరిని మరింత ప్రైవేట్‌గా ఉంచేందుకు నిరంతరం టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాం” అని స్పష్టం చేసింది. యాపిల్ కంపెనీ వినియోగదారుల ప్రైవసీని కాపాడుతుందని తెలిపింది.
సిరి యాపిల్ వాయిస్ అసిస్టెంట్, వినియోగదారుల ఆదేశాలను అంగీకరించి, సమాధానాలు ఇవ్వడానికి, అనేక పనులను నిర్వహించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నది. దీని ద్వారా పంపించిన సమాచారం సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చింది.
పరిమితి కలిగిన సమాచారాన్ని మాత్రమే సేవ్ చేస్తూ, శిక్షణ, నిఘా కోసం స్టోర్ చేసే డేటాను అనేక మంది ఎంచుకున్న సాఫ్ట్‌వేర్‌ల ద్వారా జాగ్రత్తగా నిర్వహిస్తామని తెలిపింది. ఇవన్నీ యూజర్ల ప్రైవసీకి ప్రాధాన్యాన్ని ఇవ్వడమే కాకుండా, అవి అత్యధిక సురక్షితంగా నిర్వహిస్తామని పేర్కొన్నది.
అమెరికా చేతిలో టెలిగ్రామ్ యూజర్ల డేటా
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ యూజర్స్ డేటా అగ్రరాజ్యం అమెరికా చేతికి చిక్కుతున్నది. ఈ విషయాన్ని స్వయంగా టెలిగ్రామ్ తన ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్‌లో పేర్కొన్నది. నిరుడు 900 రిక్వెస్టులు పెట్టిన అమెరికా ప్రభుత్వం 2,253 మంది యూజర్ల డేటాను సేకరించిందని పేర్కొన్నది.
తొలి 9 నెలల్లోనే సర్కారు నుంచి 14 విజ్ఞప్తులు రాగా.. 108 మంది డేటాను అందజేసినట్టు వెల్లడించింది. నిరుడు ఆగస్టులో టెలిగ్రామ్ సీఎం పావెల్ దురోవ్ అరెస్ట్ తర్వాత.. అక్టోబర్-డిసెంబర్ మధ్య అమెరికా ప్రభుత్వ దరఖాస్తుల సంఖ్య పెరిగింది.
టెలిగ్రామ్ ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణా, హవాలా, తదితర సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలతో పారిస్ ఎయిర్‌పోర్టులో పావెల్‌ను ఫ్రాన్స్ అధికారులు అతడిని అరెస్టు చేశారు.
ఆయన అరెస్ట్ తర్వాత టెలిగ్రామ్ తన ప్రైవసీ పాలసీలో మార్పులు చేసింది. ఇంతకుముందు యూజర్ల వివరాలను ఎవరితో పంచుకునే వీలు లేదు. కానీ.. ఇప్పుడు రిక్వెస్ట్ వస్తే చాలు యూజర్ల ఐపీ, ఫోన్ నెంబర్ లాంటి డేటాను ప్రభుత్వానికి అందజేస్తున్నది. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.