వీడియో స్ట్రీమింగ్ సేవలను అందుబాటులోకి తెస్తోంది టెక్ దిగ్గజం యాపిల్. ఐ ఫోన్ లేటెస్ట్ 11 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన ఈ కంపెనీ… యాపిల్ టీవీ+ వీడియో కంటెంట్ సర్వీస్ ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ లాంటి సంస్థలు… అదర్ ప్లాట్ ఫామ్స్ రూపొందించిన వీడియో కంటెంట్ ను లైసెన్స్ తో స్ట్రీమ్ చేస్తుంటాయి. కానీ.. యాపిల్ టీవీ+ అనేది ఆ సంస్థ సొంత వీడియో కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్. అంటే.. యాపిల్+ యాప్ లో స్ట్రీమ్ అయ్యే కంటెంట్ యాపిల్ కంపెనీ సొంతంగా రూపొందించిన వీడియోలే. అవి మరెక్కడా ప్రసారం అయి ఉండవని.. కేవలం తమ సంస్థ రూపొందించిన కంటెంట్ అందులో ప్రసారం అవుతుందని… యాపిల్ క్యాంపస్ లో సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల చెప్పారు. దీనికి సంబంధించిన ధరలు ఇపుడు బయటకు వచ్చాయి.
నవంబర్ 1వ తేదీన యాపిల్ టీవీ+ సర్వీస్ ప్రారంభం కానుంది. తక్కువ ధరలతో యాపిల్ టీవీ+ను జనంలోకి తీసుకొస్తోంది సంస్థ. అమెరికాలో నెలకు కేవలం 4.99 డాలర్లకు.. ఇండియాలో కేవలం రూ.99లకు సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను ప్రకటించింది. ఇండియాలో నెట్ ఫ్లిక్స్ 199 రూపాయలతో నెలవారీ ప్లాన్స్ ఉన్నాయి. అమేజాన్ ప్రైమ్ 129 రూపాయలతో మంత్లీ ప్లాన్స్ తీసుకొచ్చింది. ఏడాదికి తీసుకునే ప్లాన్ లో కొంత డిస్కౌంట్ ఉంటుంది.
మొదటి వారం రోజుల పాటు… యాపిల్ టీవీ+ వీడియో కంటెంట్ ను ఉచితంగా చూసే ఫెసిలిటీ కల్పించింది. ఆ తర్వాత కంటిన్యూ చేయాలనుకునేవాళ్లు 99 రూపాయలు చెల్లించి యాపిల్ టీవీ+ సర్వీస్ ను పొందొచ్చు.
ఇందుకోసం కొత్త యాప్ ను కంపెనీ ప్రకటించలేదు. మొబైల్ iOS 12.3, టీవీ ఓఎస్ 12.3 ఆ తర్వాత వెర్షన్లు, క్యాటలినా మ్యాక్ ఓఎస్.. ఈ వీడియో కంటెంట్ కు సపోర్ట్ చేస్తుంది. 2018, 2019లో సామ్ సంగ్ విడుదల చేసిన కొన్ని స్మార్ట్ టీవీలు, ఫోన్లు.. ఈ వీడియో కంటెంట్ ను సపోర్ట్ చేస్తాయని యాపిల్ తెలిపింది.