సౌతిండియా యాపిల్స్ ఇవి

ఇన్నాళ్లూ నార్తిండియాలోని మూడు రాష్ట్రాలు,నార్తీస్ట్​లోని కొన్ని చోట్లకే పరిమితమైన యాపిల్స్​ ఇప్పుడు సౌతిండియాలోనూ పండుతున్నాయి.వేడి ప్రాంతాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతోపాటు మహారాష్ట్రలో కూడా ప్రయోగాత్మకంగా ఆపిల్​ తోటలు వేశారు. నాలుగైదేళ్ల శ్రమ ఫలించింది. ఈ మధ్యే దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం మార్కెట్​లో సౌతిండియా యాపిల్స్ సరసమైన రేట్లకే దొరుకుతున్నాయి. అరచేతిలో పట్టనంత పెద్ద సైజులో, మైనం పూత లేకుండా నిగనిగలాడే తాజాదనంతో నోరూరిస్తున్నాయి.

ఈ భూమ్మీద ఆడమ్, ఈవ్​ల​తో పాటు పుట్టింది యాపిల్​ పండు అని బైబిల్​ చెబుతోంది. అంటే, భూమ్మీద సాగవుతున్న అత్యంత పాత పంటల్లో యాపిల్​ ఒకటి. ఇది చాలా తక్కువ టెంపరేచర్​గల ప్రాంతాల్లోనే పండుతుంది. మన దేశంలో యాపిల్స్​కి అనుకూలమైనవి హిమాలయ రీజియన్​లోని కాశ్మీర్, హిమాచల్​ప్రదేశ్, ఉత్తరాఖండ్, నార్త్​ ఈస్ట్​లోని అరుణాచల్​ ప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాలు. ఆయా ప్రదేశాల్లో ఈమధ్య వాతావరణ పరిస్థితులు మారిపోతుండటం వల్ల యాపిల్​ దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో ఇతర ప్రాంతాల్లో యాపిల్​ని పెంచడానికి నాలుగైదేళ్ల కిందటే ప్రయత్నాలు మొదలుపెట్టారు సైంటిస్టులు.

ఏపీలో కాశ్మీర్!

ఏపీ​లో కాశ్మీర్​లాంటి​ ప్రాంతం విశాఖ మన్యం. అక్కడి లంబసింగి, పాడేరు, అరకు లాంటి చోట్ల టెంపరేచర్​ చాలా తక్కువ. విశాఖపట్నం జిల్లాలోని అరకు లోయను యాపిల్​​ సాగు కోసం గుర్తించారు. ఈ లోయ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 3,600 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ చలికాలం టెంపరేచర్​ 5 నుంచి ఒక్క డిగ్రీకి పడిపోతుంది. ఇలాంటి పరిస్థితులే యాపిల్స్​ సాగుకి సూటవుతాయి. దీంతో అరకు పరిధిలోని లంబసింగి, చింతపల్లి, పాడేరు, పెదబయలు, జి.మాడుగుల, అనంతగిరి వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రయోగాలు చేశారు. అవి సక్సెసయ్యాయి. ఇప్పుడు పండ్లు చేతికొచ్చాయి. అవే ‘విశాఖ యాపిల్స్’​గా పాపులర్​.

మరో నాలుగు రాష్ట్రాల్లో…

యాపిల్స్​లో గోల్డెన్‌‌ డెలీషియస్‌‌, రాయల్‌‌ గాలా, గ్రానీ స్మిత్‌‌, హానీ క్రిస్ప్​, పింక్‌‌ లేడీ, స్టార్కింగ్‌‌, ఫ్యూజీ, క్రిస్ప్​ ‌రెడ్‌‌, బీబర్న్‌‌ తదితర 20 రకాలు జమ్మూ కాశ్మీర్​ తదితర ప్రాంతాల్లో పండుతున్నాయి. టెంపరేచర్​ ఎక్కువగా ఉండే  ఫ్లోరిడా (అమెరికా) రాష్ట్రంలోనూ, సౌతాఫ్రికా, ఇజ్రాయెల్​ దేశాల్లోనూ ‘అన్నా’ అనే యాపిల్​ రకాన్ని పండిస్తున్నారు. కర్ణాటకలోని కూర్గ్, తమిళనాడులోని నీలగిరి, ఊటీ; మహారాష్ట్రలోని నాసిక్​ ప్రాంతాల్లో కూడా సాగు చేస్తున్నారు. హిమాచల్​ప్రదేశ్‌‌కు చెందిన హరిమన్‌ ‌శర్మ అనే రైతు 40–45 డిగ్రీల టెంపరేచర్​లో కూడా పండే రకాన్ని డెవలప్​ చేసి సైంటిస్టుల్ని ఆశ్చర్యపరిచాడు.

కజక్​స్థాన్​లో పుట్టి…

సెంట్రల్​ ఆసియా దేశమైన కజక్​స్థాన్​లో యాపిల్​ పుట్టినట్లుగా చెబుతారు. దీన్ని గ్రీక్​​ దేశంలోని మాసిడోనియా రాజ్య పాలకుడు ‘అలెగ్జాండర్ ది గ్రేట్​’ తొలిసారి తన కింగ్​డమ్​లో సాగు చేయించారట. ఆ తర్వాతే ఈ పంట ప్రపంచ దేశాలకు విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. మన దేశానికి యాపిల్​ని మొదటిసారిగా 1960ల్లో శామ్యూల్​ ఎవాన్స్​ స్టోక్స్​ లేదా సత్యానంద స్టోక్స్​ అనే వ్యక్తి తెచ్చారని అంటున్నారు. అలా హిమాచల్​ప్రదేశ్​లో ప్రారంభమైన యాపిల్​ ప్రస్థానం ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని మేజర్​ ఎక్స్​పోర్ట్ స్టేట్​గా మార్చేసింది.

7500లకు పైగా వెరైటీలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా​ 7500లకుపైగా యాపిల్​ రకాలను సాగుచేస్తున్నారు. ఇందులో కనీసం 300 వెరైటీలు మన దేశంలో పండుతున్నాయి. ఇప్పుడు యాపిల్​ ప్రొడక్షన్​లో ఇండియా ఐదో పెద్ద​ దేశం. ఏడు లీడింగ్​ వెరైటీలకు చెందిన 100 మొక్కలతో ఐదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో యాపిల్​ సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తర్వాత మొక్కల సంఖ్యని 500కు పెంచారు. మొదట 50 ఎకరాలను ఎంపిక చేసి తర్వాత 10 వేల ఎకరాలకు విస్తరించారు. మొదట్లో వంద మంది రైతులే ఈ పంట పండించటానికి ముందుకొచ్చారు.

మొదటి మూడేళ్లు కీలకం  

మొక్క వయసు మూడేళ్లకు చేరాక దిగుబడి వస్తుంది. ఐదో ఏట ఒక్కో చెట్టు 20 కేజీల కాయలు ఇస్తుంది. అందువల్ల మొదటి మూడేళ్లు పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. సిమ్లాలోని ‘ధార్తి ధన్ ఆగ్రో ఫార్మ్స్​’.. ఆర్గానిక్​ ఫార్మింగ్​, యాపిల్​ కల్టివేషన్​లో ఎక్స్​పర్ట్​ అని, అవసరమైతే ఆ  సంస్థ సాయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. సౌతిండియాలో గతంలోనూ చాలా సార్లు యాపిల్​​ సాగుని పెద్దఎత్తున చేపట్టినా సక్సెస్​ కాలేదు. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించి ఎట్టకేలకు నెగ్గారు.

ఇతర (దేశాల ) పంటలూ..

ఏపీలోని విశాఖ ఏరియాలో యాపిల్​తోపాటు ఇతర (దేశాల) పంటలు కూడా పండిస్తున్నారు. పియర్స్​, కివీ, ఆల్మండ్​, చెర్రీస్​, పీచ్​, జపనీస్​ పెర్సిమ్మన్​ వంటి పండ్ల మొక్కలు నాటారు. హార్టికల్చర్​ డిపార్ట్​మెంట్​ చేపట్టిన ఈ చెట్ల పెంపకం విజయవంతంగా సాగుతోంది. పండ్లు చేతికొచ్చేసరికి మరికొంత సమయం పడుతుందని ఆఫీసర్లు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్​గా పండిస్తున్న ఈ పంటలు విశాఖ ఏజెన్సీలోని రైతులకు ఉపాధి చూపుతాయనే భరోసా ఇస్తున్నారు.-

ఆదిలాబాద్​లోనూ…

ఏపీతోపాటు తెలంగాణలోని ఆదిలాబాద్‌‌లో కూడా యాపిల్​ సాగు మొదలుపెట్టారు. 2016 జనవరిలో 10 వేల మొక్కల్ని ఏజెన్సీ గిరిజనులకు సప్లయి చేయగా ఈ ఏడాది దిగుబడి మొదలైంది. హిమాచల్​ప్రదేశ్​లో పండే అన్నా, డార్సెట్ గోల్డెన్ రకాల మొక్కల్ని ఇక్కడ నాటారు. ‘హిమాలయ ప్రాంతాల్లో డిసెంబర్‌‌, జనవరి నెలల్లో యాపిల్​ చెట్లు పూర్తిగా మంచుతో కప్పుకుపోయి ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. అందువల్ల ఏటా రెండు పంటలు వచ్చే ఛాన్స్​ ఉంది’ అని ఎక్స్​పర్ట్​లు​ చెబుతున్నారు.