ఆదిలాబాద్ ​కలెక్టరేట్​ ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ

 ఆదిలాబాద్ ​కలెక్టరేట్​ ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ

ఆసిఫాబాద్/ఆదిలాబాద్​టౌన్/నస్పూర్, వెలుగు: ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆదిలాబాద్​కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్​రాజర్షి షా దరఖా స్తులు స్వీకరించారు. విద్య, వైద్యం, మున్సిపల్, ఎస్సీ కార్పొరేషన్, విద్యుత్, పంచాయతీ, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సంబంధించిన 111 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్​ ఆదేశించారు. ఈ సందర్భంగా తలమడుగు మండలంలో గతంలో ఎలుగుబంటి దాడిలో గాయపడిన వ్యక్తికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అడిషనల్ ​కలెక్టర్​ శ్యామలాదేవీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తులను పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్​లో ఆర్డీవో లోకేశ్వర్ రావు తో ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. సదరం సర్టిఫికెట్, దివ్యాంగ ఫించన్, కబ్జాల నుంచి భూమిని విడిపించాలని, ఉపాధి హామీ పథకంలో ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీలు సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ అందిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేలా సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు.

దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి 

ప్రజావాణిలో అందిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టి పరిష్కరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో శ్రీనివాసరావుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. భూమి విరాసత్, పట్టా పాసు పుస్తకం, పరిహారం ఇప్పించాలని దరఖాస్తులు అందజేశారు.