ఆర్టీఐ చట్టమా.. డోంట్​కేర్! జీహెచ్ఎంసీ సరైన సమాచారం ఇవ్వడం లేదంటున్న దరఖాస్తుదారులు

ఆర్టీఐ చట్టమా.. డోంట్​కేర్! జీహెచ్ఎంసీ సరైన సమాచారం ఇవ్వడం లేదంటున్న దరఖాస్తుదారులు
  • జీహెచ్ఎంసీలో పెండింగ్లో 400 దరఖాస్తులు 
  • అన్ని  క్లియర్ చేశామంటూ కమిషన్ కు తప్పుడు రిపోర్ట్​ 
  • హెచ్ఓడీలకు తెలిసే ఇదంతా!

హైదరాబాద్ సిటీ, వెలుగు:
జీహెచ్ఎంసీ సమాచార హక్కు చట్టాన్ని పట్టించుకోవడం లేదు. దరఖాస్తు చేసిన వారికి సరైన సమాచారమివ్వడం లేదు. పైగా వచ్చిన అప్లికేషన్లంటినీ క్లియర్​చేశామంటూ సమాచార కమిషన్ కు తప్పుడు రిపోర్టులు పంపిస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో 400కిపైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రతి మూడు నెలలకోసారి 600 వరకు దరఖాస్తులు వస్తుంటాయి. ఇందులో ఎప్పుడు కూడా వందల్లోనే అప్లికేషన్లు పెండింగ్ లో ఉంటున్నాయి. అలాగే, ఆరు జోనల్ ఆఫీసుల్లో వెయ్యి వరకు అప్లికేషన్లు పెండింగ్ లో ఉండగా, 30 సర్కిల్ ఆఫీసుల్లో దాదాపు 1,500  వరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 

నిధులు, పనులు, చర్యలు, అభివృద్ధి ఇతరత్రా ఏ విషయంపై అడిగినా బల్దియా అధికారులు ఇన్ఫర్మేషన్​ఇవ్వడం లేదు. ఏవేవో సాకులు చెప్పి ఆలస్యం చేస్తున్నారు. చట్టం ప్రకారం ప్రతి ఆఫీసులో సమాచారమిచ్చే ఆఫీసర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు అడ్రస్ లు, ఈ–మెయిల్​వివరాలు పెట్టాల్సి ఉండగా ఎక్కడా కనిపించడం లేదు.  

అంతా తప్పుడు సమాచారమే..

ఆర్టీఐ యాక్ట్ కింద దరఖాస్తు చేసిన 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, చాలామందికి బల్దియా అధికారులు రిప్లై ఇవ్వడం లేదు. కొంతమందికి ఏదో మొక్కుబడిగా సమాచారం ఇస్తున్నారు. మరికొందరికి తప్పుడు ఇన్ఫర్మేషన్​ఇస్తున్నారు. కమిషన్ కు మాత్రం తమ దగ్గర ఉన్న దరఖాస్తులన్నీ క్లియర్ చేశామంటూ తప్పుడు రిపోర్టులు పంపిస్తున్నారు. కొంతమంది దరఖాస్తుదారులు అప్పీల్ కు వెళ్తే అప్పుడు పూర్తి సమాచారం ఇస్తున్నారు. సంబంధిత హెచ్ఓడీ లకు తెలిసే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఎక్కువగా వీటిపైనే దరఖాస్తులు..

టౌన్ ప్లానింగ్ పర్మిషన్ల గురించి, అభివృద్ధి పనులు ఎక్కడ చేశారని, టెండర్లు ఎప్పుడు పిలిచారని, బిల్లులు చెల్లింపుల వివరాలివ్వాలంటూ  పలువురు బల్దియాను ఆర్టీఐ కింద అడుగుతున్నారు. అలాగే, ఉద్యోగుల ప్రమోషన్లు, నియామకాల గురించి చెప్పాలంటూ భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇంజినీరింగ్ విభాగంలో సింగిల్ టెండర్లకు దొడ్డిదారిన పనులు కట్టబెట్టిన అంశాలపై కాంట్రాక్టర్లు, పబ్లిక్ నుంచి భారీగా ఆర్టీఐ ద్వారా దరఖాస్తులు వస్తున్నాయి. 

అయితే, ఇందులో బల్దియా కొంత సమాచారం మాత్రమే ఇస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి జీహెచ్ఎంసీకి వచ్చి ఏళ్లకు ఏండ్లుగా ఇక్కడే ఉంటున్న వారి వివరాలు సైతం బయటికి రానివ్వడం లేదు. జీహెచ్ఎంసీ చేపట్టిన చేసిన ప్రతి పని, నోట్ ఫైల్ వివరాలు సైతం ఇవ్వాల్సి ఉండగా గోప్యత అంటూ సమాచారాన్ని దాస్తున్నారు. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో కొందరు అక్రమ సర్టిఫికెట్లతో  డ్యూటీ చేస్తున్నారన్న ఆరోపణలుండగా, దీనిపై కూడా సమాచారం అడిగితే ఇవ్వలేదని దరఖాస్తుదారులు చెబుతున్నారు. 

400కిపైగా అప్లికేషన్లు పెండింగ్

జీహెచ్ఎంసీ సంబంధించిన వివిధ రకాల సమాచారం కోసం ఆర్టీఐ కింద వచ్చిన దరఖాస్తులు 400పైగా పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. సమాచారం అడిగిన వారిలో కొందరికి ఫోన్​చేసి టైమ్​పడుతుందని, మరి కొందరికి సమాచారం ఇవ్వడం కష్టమేనని చెబుతున్నట్లు దరఖాస్తుదారులు చెప్తున్నారు.