గ్రూప్–4 పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది. మొత్తం 8,068 పోస్టులకు 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్/ మే నెలలో పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది. పోస్టులు తక్కువ, తీవ్రమైన పోటీ, నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఉంది. ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను విభజించుకొని చదివితే విజయం సాధించవచ్చు.
మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 జనరల్ స్టడీస్, పేపర్–2 సెక్రటేరియట్ ఎబిలిటీ. జనరల్ స్టడీస్ సిలబస్‌లో మొత్తం 11 అంశాలు ఉన్నాయి. అవి.. కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంఘటనలు, కార్యక్రమాలు, నిత్య జీవితంలో సైన్స్, విపత్తుల నిర్వహణ, పర్యావరణ అంశాలు, భారత, తెలంగాణ జాగ్రఫీ, భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, ఆధునిక భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు.
కరెంట్ అఫైర్స్ కీలకం
పోటీ పరీక్ష ఏదైనా కరెంట్ అఫైర్స్ చాలా కీలకం. కొన్ని సమయాల్లో విజయావకాశాలనూ నిర్ణయిస్తుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ఎగ్జామ్ తేదీకి 9 నెలలు వెనుక నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. గరిష్ఠంగా ఏడాదికాలం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావడం మేలు. ఇంటర్నేషనల్ అఫైర్స్, ఈవెంట్స్‌లో వివిధ దేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాలపై ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా సరిహద్దు దేశాలు, వివాదాలపై ప్రశ్నలు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. గత ఏడాది కాలంలో జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌పై దృష్టి సారించాలి. సిలబస్ లో తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ భౌగోళికం, తెలంగాణ ఉద్యమం, సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, పాలనా విధానాలు, ఆర్థిక వ్యవస్థ మొదలైన టాపిక్స్‌ను లోతుగా చదివితే 40 – 50 మార్కులను సులువుగా సాధించవచ్చు.
50కి పైగా ప్రశ్నలు
భారత రాజ్యాంగంలో పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధుల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అలాగే కరెంట్ అఫైర్స్‌తో కలిపి చదివితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలపై లోతుగా చదవాలి. ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయం, నిరుద్యోగం, పేదరికం మౌలిక భావనలు చదవాలి. ఆధునిక భారతదేశంలో జాతీయోద్యమం టాపిక్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. గవర్నర్ జనరల్స్, విధానాలు, మితవాద, అతివాద యుగాలు, జాతీయోద్యమంలోకి గాంధీ ప్రవేశం, పోరాటాలను లోతుగా చదవాలి. , ఉద్యమాన్ని నడిపిన ప్రముఖుల జీవిత చరిత్రలపై ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
పేపర్ –2
సెక్రటేరియల్ ఎబిలిటీస్‌లో మొత్తం 5 అంశాలు ఉన్నాయి. అవి.. మెంటల్ ఎబిలిటీ (వర్బల్ అండ్ నాన్ వర్బల్), లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, రీ–అరెంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్. కాంప్రహెన్షన్, రీ–అరెంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచే 25 ప్రశ్నలు వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలకు ప్రత్యేకంగా ఏ పుస్తకాలూ చదవాల్సిన అవసరం లేదు. ఇంగ్లిష్ పేరాలను వేగంగా చదవి, అర్థం చేసుకోవడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్‌తోపాటు ప్రాక్టీస్ బిట్స్‌ను ఎక్కువగా సాధన చేయాలి. గత గ్రూప్–4 ఎగ్జామ్‌లో అత్యధికంగా రీజనింగ్ నుంచి 75 ప్రశ్నలు వచ్చాయి. ఆ తర్వాత అర్థమెంటిక్ నుంచి 50 వరకు ప్రశ్నలను ఇచ్చారు. ఈ వెయిటేజీని దృష్టిలో పెట్టుకుని రీజనింగ్ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మార్కులను స్కోర్ చేయవచ్చు. మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్‌లో కోడింగ్ డికోడింగ్, రక్త సంబంధాలు, పజిల్స్, వర్గీకరణ, ఎనాలజీ, ఎసర్షన్ రీజన్, వెర్బ నాన్ వెర్బల్ రీజనింగ్ మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నల్లోని లాజిక్, పరిష్కార పద్ధతిని తెలుసుకొని వీలైనన్ని ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
ఐదురకాల అర్హతలు
గ్రూప్–4 సర్వీసుల్లో భాగంగా 99 డిపార్ట్మెంట్లలో 8039 పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది. టీఎస్పీఎస్సీ నిర్వహించే ఈ సర్వీసులో జూనియర్ అకౌంటెంట్ (కమిషనర్ & మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్), జూనియర్ అసిస్టెంట్ (ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్), జూనియర్ అసిస్టెంట్ పీ & ఏ (హెచ్ఎండీఏ), జూనియర్ అసిస్టెంట్ ఎఫ్ & ఏ (హెచ్ఎండీఏ), మ్యాటర్న్/ మ్యాటర్న్ కం స్టోర్‌కీపర్ పోస్టులకు మినహా మిగిలిన అన్ని పోస్టులకు సాధారణ డిగ్రీ అర్హతగా నిర్ణయించారు.
జూనియర్ అకౌంటెంట్ (కమిషనర్ & మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) పోస్టులు : 224
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కామర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత.
జూనియర్ అసిస్టెంట్ (ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్) పోస్టులు: 46
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. డిగ్రీలో ఓసీ, బీసీ అభ్యర్థులు 50శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40శాతం మార్కులు సాధించి ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ పీ & ఏ (హెచ్ఎండీఏ) పోస్టులు : 100
అర్హత : ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
జూనియర్ అసిస్టెంట్ ఎఫ్ & ఏ (హెచ్ఎండీఏ)
పోస్టులు : 67
అర్హత : బీకాం (కంప్యూటర్స్)
మ్యాటర్న్/ మ్యాటర్న్ కం స్టోర్‌కీపర్
పోస్టులు : 28
అప్లికేషన్ : అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 30 నుంచి జనవరి 30 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. సమాచారం కోసం www.tspsc.gov.in
అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
సెలెక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష (ఆబ్జెక్టివ్టైప్), సర్టిఫికేట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. మూడు క్యాడర్లు
గ్రూప్–4లో పోస్టుల్లో డిస్ట్రిక్ క్యాడర్, కాంటిజుయస్ డిస్ట్రిక్, స్టేట్ క్యాడర్ గా పోస్టులు ఉన్నాయి.
స్టేట్ క్యాడర్ : 627 పోస్టులు.. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో 627 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను స్టేట్ క్యాడర్‌గా విభజించారు. వీటికి లోకల్ రిజర్వేషన్ వర్తించదు. ఏ జిల్లాకు చెందినవారైనా అర్హులే.
కాంటిజుయస్ క్యాడర్: 548 పోస్టులు.. డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్, హెచ్ఎండీఏలో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రలాజీ, డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, జీహెచ్ఎంసీ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌లోని 548 పోస్టులు ఉన్నాయి. వీటికి సమీప జిల్లాలకు చెందిన అభ్యర్థులూ అర్హులే.
డిస్ట్రిక్ క్యాడర్: 6862 పోస్టులు: స్టేట్ క్యాడర్, కాంటిజుయస్ డిస్ట్రిక్ పోస్టులు మినహా మిగిలిన 6862 పోస్టులను డిస్ట్రిక్ క్యాడర్లో భాగంగా భర్తీ చేయనున్నారు. వీటి ఆయా జిల్లాల లోకల్ అభ్యర్థులు మాత్రమే అర్హులు.