ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో వెనుకబడిన యాదాద్రి

  • భూ సమస్యలే ఎక్కువ స్టేట్ నుంచి జిల్లాకు అప్లికేషన్లు
  • 150 అప్లికేషన్లపై ఫుల్​ రిపోర్ట్​.. ఇందులో 113 పోడు అప్లికేషన్లే
  • ప్రభుత్వ నిర్ణయమే కీలకమని రిప్లయ్​

యాదాద్రి, వెలుగు : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో యాదాద్రి జిల్లా వెనుకబడింది. హైదరాబాద్​లోని ప్రజా భవన్​లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి జిల్లా నుంచి అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అప్లికేషన్లు చేసుకుంటున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణికి అప్లికేషన్​ చేసుకున్నా పరిష్కారం కావడం లేదనే ఉద్దేశంతో ఇక్కడి ప్రజలు హైదరాబాద్​కు వెళ్లి మరీ అప్లికేషన్లు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు యాదాద్రి జిల్లా నుంచి 800కు పైగా అప్లికేషన్లు చేసుకున్నారు. ప్రజలు చేసుకున్న అప్లికేషన్లను ఎప్పటికప్పుడు హైదరాబాద్​ నుంచి జిల్లాకు ఫార్వర్డ్​చేస్తున్నారు. దీంతో పైస్థాయి ఆఫీసర్ల నుంచి ఒత్తిడి రావడంతో వాటిని పరిష్కరించడానికి ఇటీవల వేగం పెంచారు. 

భూ సమస్యలే ఎక్కువ..

హైదరాబాద్ నుంచి వచ్చిన అప్లికేషన్లను పరిష్కారం విషయంలో అన్ని జిల్లాల కంటే యాదాద్రి వెనుకబడటంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రజావాణి అప్లికేషన్ల పరిష్కారంపై గత నెల చివరి వారం నుంచి ఆఫీసర్లు దృష్టి సారించారు. వచ్చిన అప్లికేషన్లను మండలం వారీగా విభజించి సంబంధిత డిపార్ట్​మెంట్లు, తహసీల్దార్లకు పంపించారు. దీంతో ప్రజావాణికి జిల్లా ప్రజలు చేసుకున్న అప్లికేషన్లలో ఎక్కువగా భూ సమస్యలే ఉన్నట్టు తేలింది. ధరణి కారణంగా తమ భూముల సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొంటూ ప్రజలు అప్లికేషన్లు చేసుకున్నారు. అదే విధంగా రియల్​ఎస్టేట్​వ్యాపారులు చేసిన వెంచర్లలో తాము ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయామని పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి.  

న్యాయం చేయాలి.. 

పోడు భూమల కోసం ప్రజావాణికి చౌటుప్పల్ మండలం నుంచి 113 అప్లికేషన్లు వచ్చాయి. గత ప్రభుత్వం పోడు భూములు ఇస్తామని చెప్పి.. పంపిణీ చేయలేదంటూ పలువురు పేర్కొన్నారు. వీటిని పంపిణీ  చేసి తమకు  న్యాయం చేయాలని బాధితులు కోరారు. అదే విధంగా సంస్థాన్​ నారాయణపురం నుంచి కూడా పోడు భూములు విషయంలో న్యాయం చేయాలని మరికొందరు అప్లికేషన్​ చేసుకున్నారు. 

150 అప్లికేషన్లపై రిపోర్ట్..

జిల్లాకు వచ్చిన 800లో కొన్ని అప్లికేషన్లను డిపార్ల్​మెంట్ల వారీగా ఆఫీసర్లు క్షుణ్ణంగా పరిశీలించారు. వీటిలో 150 అప్లికేషన్లకు సంబంధించిన పూర్తి రిపోర్ట్​ను స్టేట్​నోడల్​ఆఫీసర్​కు పంపించారు. వీటిలో 113 అప్లికేషన్లు పోడు భూములకు సంబంధించినవే ఉన్నాయి. పోడు భూములపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ అంశంపై ముందుకు వెళ్లే అవకాశముందని అప్లికేషన్​ చేసుకున్న వారికి సమాచారం అందించారు. అదే విధంగా కబ్జాలు, వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోయిన వారు పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. కాగా వచ్చిన అప్లికేషన్లలో మరో 650కి పైగా పెండింగ్​లోనే ఉన్నాయి.