జనగామ అర్బన్, వెలుగు : ప్రజా పాలన, ఆరు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకునేందుకు ఆఫీసర్లు రెడీగా ఉండాలని జనగామ కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు పర్మార్ పింకేశ్ కుమార్, సుహాసిని, జిల్లా ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని జనగామ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఆఫీసర్లు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమ నిర్వహణ కోసం నియోజకవర్గం, మండల, గ్రామస్థాయిల్లో ప్రత్యేక టీంలను నియమించనున్నట్లు చెప్పారు.
ఆరు గ్యారంటీల అమలు కోసం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు అప్లికేషన్లు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో అనిల్‌కుమార్, సీపీవో ఇస్మాయిల్, డీఆర్డీవో మొగులప్ప, డీపీవో రంగాచారి, ఆర్డీవోలు మురళీకృష్ణ, రామ్మూర్తి, డీఎంహెచ్‌వో ప్రశాంత్, డీఎస్‌వో రోజారాణి, డీడబ్ల్యూవో జయంతి పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
హనుమకొండ సిటీ, వెలుగు : ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఆఫీసర్లతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు.
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు. 6వ తేదీ నాటికి అన్ని గ్రామాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఆఫీసర్లు కో ఆర్డినేషన్‌తో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, మహేందర్, డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్, డీపీవో జగదీశ్వర్ పాల్గొన్నారు.