- వెబ్సైట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఈ నెల 15 తర్వాత ఆన్‌లైన్‌లో స్వీకరణ మొదలు
ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. ఇందు కోసం వెబ్సైట్ను రూపొందిం చారు. దీన్ని మంగళవారం సీఎం రేవంత్ ప్రారంభించారు.
హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్ సైట్ ను రూపొందించారు.
సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వెబ్ సైట్ ను మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇక ముందు సీఎం సహాయ నిధి దరఖాస్తులనుఈ వెబ్ సైట్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్లో సంబంధింత దరఖాస్తు దారుల బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ ఎఫ్ అప్లికేషన్ను ఆమోదించి చెక్కును రెడీ చేస్తారు.
చెక్కు పైన తప్పనిసరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నంబర్ ను ముద్రిస్తారు. దీని వల్ల చెక్కు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్కులను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https//cmrf.telangana.gov.in సైట్ లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది.