హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు నిర్వహించనున్న డీఎస్సీకి దరఖాస్తులు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. నెలరోజుల నుంచి కొత్తగా 37,700 వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఇప్పటికే గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం పాత నోటిఫికేషన్ను రద్దు చేసి, 11,062 పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి4 నుంచి డీఎస్సీ అప్లికేషన్లు మరోసారి ప్రారంభించి, ఏప్రిల్ 3 వరకు గడువు పెట్టింది.
అయితే, టెట్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు గడువును జూన్ 20 దాకా పెంచింది. దీంతో అప్లై చేసుకోవాల్సినోళ్లు చివర్లో చేద్దామనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 27,500, ఎస్జీటీ పోస్టులకు 4,500, ఎస్జీటీ(స్పెషల్ ఎడ్యుకేషన్)కి 800, ఎస్ఏ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులకు 550 మంది దరఖాస్తు చేసుకున్నారు. పీఈటీ పోస్టులకు 2,200, లాంగ్వేజీ పండిట్ల కోసం 2,250 మంది అప్లై చేశారు. కాగా, గతంలోనే అప్లై చేసిన 1.77 లక్షల మంది మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు.