ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్ టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌‌లో  99 ఫిర్యాదులు అందాయని ఆఫీసర్లు చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు అడిషనల్‌‌ కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా,  అర్జీలను పెండింగ్‌‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 

భూ సమస్యల ఫిర్యాదులే ఎక్కువ

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్‌‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువ వచ్చాయి. 104 ఫిర్యాదులు వస్తే ఇందులో  75  రెవిన్యూ శాఖకు సంబంధించి భూముల సమస్యలే. డీఆర్​డీవో సాయన్న, కలెక్టరేట్ ఏవో రవీందర్ ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత శాఖల ఆఫీసర్లకు పంపి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మేం చిల్లర రాజకీయాలు చెయ్యం

నిజామాబాద్, వెలుగు: టీఆర్‌‌ఎస్‌ ప్రతిపక్షాల పార్టీల తరహా చిల్లర రాజకీయాలు చేయదని, తాము అభివృద్ధి పనులతో పోటీ పడుతామని అందుకే పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలోని మండలాల్లో అభివృద్ధి పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. రెండు కోట్లతో ముప్కాల్ నుంచి ఎస్సారెస్పీ పంపు హౌస్ వరకు చేపడుతున్న బీటీ రోడ్డు, రూ.81 లక్షలతో కొత్తపల్లి నుంచి ముప్కాల్ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు, వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామం నుంచి పడగల్ వరకు రూ.60 లక్షలతో చేపడుతున్న పంచాయతీ రాజ్ బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సందర్భంగా మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వేరే రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని, అభివృద్ధికి శ్రమిస్తున్న తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతిని ధులు,  అధికారులు పాల్గొన్నారు     

‘న్యాక్’ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి 

స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు వీలుగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) సంస్థ ద్వారా అందిస్తున్న శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవా లని మంత్రి ప్రశాంత్‌రెడ్డి సూచించారు. భీం గల్ మున్సిపల్ పట్టణంలోని సహస్ర ఫంక్షన్ హాల్‌లో న్యాక్  ద్వారా శిక్షణ పొందిన 133 మంది మహిళలకు మంత్రి కుట్టుమిషన్లు, శిక్షణ పొందిన 700  ట్రైనీ విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ధ్రువీకరణ పత్రాలు, టూల్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ రాజిరెడ్డి, ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, కార్మిక శాఖ అధికారి యోహాన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్‌, న్యాక్ సెంటర్ ఇన్‌చార్జి దిలీప్, ప్రభాకర్  పాల్గొన్నారు. 

ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండాలి

ముదిరాజ్‌లను బీసీ(ఏ)లోకి మార్చాలి

కామారెడ్డి, వెలుగు: ముదిరాజ్‌లను బీసీ (డీ) నుంచి బీసీ(ఏ)లోకి మార్చాలని, మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వం ఇవ్వాలని ఆ సంఘం స్టేట్ ప్రతినిధి పున్న రాజేశ్వర్ డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో ముదిరాజ్​సంఘం జెండా ఆవిష్కరించారు. అనంరతం జరిగిన మీటింగ్‌లో మాట్లాడుతూ ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్ల ఫండ్స్ ఇవ్వాలన్నారు. ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ బట్టు విఠల్, టౌన్ ప్రెసిడెంగ్ గెరిగంటి లక్ష్మీనారాయణ, ప్రతినిధులు మహేశ్, చింతల రమేశ్, నర్సింహులు పాల్గొన్నారు.  

ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండాలి

నిజామాబాద్​ రూరల్: ముదిరాజ్‌లు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చని  తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్ పేర్కొన్నారు. సోమవారం మహాసభ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని నగర శివారులోని మాధవనగర్‌‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్ మాట్లాడుతూ పాలకులు ఎన్నికల సమయంలో ముదిరాజ్‌లకు అనేక హామీలు ఇచ్చారని, కానీ  అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారని ఆరోపించారు. ఈ పరిస్థితి మారి ముదిరాజ్‌లకు న్యాయం జరగాలంటే మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముందు ముదిరాజ్​ మహాజన జెండాను ఆవిష్కరించడంతో పాటు పోస్టర్లను విడుదల చేశారు. మండల అధ్యక్షుడు బొడిగే మల్లేశ్, నాయకులు రేగొండ, యాదగిరి, ఐలయ్య, దుర్గయ్య, శ్రీని వాస్, మురళి, మల్లన్న పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం

బీర్కూర్, వెలుగు: అర్హులందరికీ పక్కా ఇండ్లను మంజూరు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. మండలంలోని చించోల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు, వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు జరిగిందనేది మన కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. గతంలో రూ. 200 పెన్షన్ ఇస్తే ఇప్పుడు రూ.2000 ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల కోట్లను పెన్షన్ల పై ఖర్చు చేస్తోందని చెప్పారు. మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని వివరించారు. బాన్సువాడ నియోజకవర్గానికి అత్యధికంగా పది వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు మంజూరైనట్లు చెప్పారు. మెజార్జీ ఇండ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు గృహ ప్రవేశం చేశారని చెప్పారు. 
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికా రులు పాల్గొన్నారు. 

కల్తీ కల్లును అరికట్టాలని ధర్నా

బోధన్​, వెలుగు: కల్తీ కల్లును అరికట్టాలని డిమాండ్ చేస్తూ బోధన్ ఎక్సైజ్ ఆఫీసు ముందు వైఎస్సార్​టీపీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ  నియోజకవర్గ కోఆర్డినేటర్​గౌతం ప్రసాద్ మాట్లాడుతూ ప్రమాదకరమైన రసాయనాలతో కల్లును కల్తీ చేస్తుంటే ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనుమతి లేని కల్లు దుకాణాలను వెంటనే మూసి వేయాలని డిమాండ్ చేశారు.  ఈ మేరకు ఎక్సైజ్ ఆఫీసు సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. కార్యాక్రమంలో వైఎస్సార్​టీపీ పట్టణ అధ్యక్షుడు యూనుస్, నాయకులు బి.సతీశ్‌, సంగమేశ్వర్, మహ్మద్ మోయినుద్దీన్, సయ్యద్ నిజాం, శాహనవాజ్ పాల్గొన్నారు.

ఏకకాలంలో రుణ మాఫీ ఏమాయే?

మోర్తాడ్, వెలుగు: టీఆర్‌‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలోని రైతులకు ఏక కాలంలో లక్ష రూపాయల రుణ మాఫీ ఏమైందని బీజేపీ లీడర్ మల్లికార్జున్‌రెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గంలో బీజేపీ తలపెట్టిన జనంతో మనం పాదయాత్ర ఏడో రోజు వేల్పూర్ మండలం పడ్గల్ గ్రామంలో కొనసాగింది. యాత్రలో పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జేఎన్‌.వెంకట్‌, అసెంబ్లీ కన్వీనర్  సుకేందర్‌‌గౌడ్, జగిత్యాల జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మన్నే గంగాధర్ పాల్గొని మద్దతు తెలిపారు. పోచంపల్లి, ధర్మోరా మార్గ మధ్య లో వ్యవసాయ రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌‌ ఎస్‌ ఇచ్చిన ఏకకాలంలో రుణ మాఫీ హామీ నీటి మూట లుగానే మిగిలిందన్నారు. మోర్తాడ్‌ మండలం పాలెం, ధర్మోర గ్రామాల వాగులో రూ.9.5 కోట్ల వ్యయంతో కట్టిన చెక్‌డ్యాం నాణ్యత లేకపోవడంతోనే కొట్టుకుపోయిందన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇచ్చి ఇలా నాసిరకం పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. యాత్రలో బీజేపీ బాల్కొండ కన్వీనర్  మల్కాన్నగారి మోహన్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్, మోర్తాడ్ మండల ప్రెసిడెంట్ పుప్పాల నరేశ్‌ పాల్గొన్నారు. 

ఎంపీ అర్వింద్‌ క్షమాపణ చెప్పాలి

బోధన్​,వెలుగు: ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బోధన్ టీఆర్ఎస్​ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం సాలూర మండల కేంద్రంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. అబద్ధాలతో ఎన్నికైన ఎంపీగా గెలిచిన అర్వింద్‌ జిల్లాకు ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలనిడిమాండ్ చేశారు. ఎంపీ నోరు అదుపులో పెట్టుకోవాలని లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రెస్​మీట్‌లో డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, బోధన్ మండల మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ బుద్ధ రాజేశ్వర్, టీఆర్‌‌ఎస్‌ బోధన్ అధ్యక్షుడు గోగినేని నరేంద్రబాబు, ఏఎంపీ వైస్ చైర్మన్ సాలూర షకీల్ తదితరులు పాల్గొన్నారు. 

పోడు భూములపై గ్రామసభ

నిజామాబాద్ రూరల్ (మోపాల్​)​, వెలుగు: మండలంలోని మంచిప్పలో సోమవారం పోడు భూములపై గ్రామసభ నిర్వహిం చారు. సర్పంచ్‌ సిద్ధార్థ పర్యవేక్షణలో జరిగిన ఈ సభలో  గ్రామ శివారులో ఎంత మంది రైతులు పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నారనే అంశంపై చర్చించారు. గ్రామస్తుల అభిప్రాయం మేరకు 36 మంది రైతులు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని గుర్తించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేశారు. సమావేశంలో ఉప సర్పంచ్‌ జగదీశ్, అటవీ అధికారి అతీఖ్, సుధీర్ పాల్గొన్నారు.