- ఫేక్ సర్టిఫికెట్లకు చెక్ పెట్టేలా బల్దియా ప్లాన్
- కొందరి అక్రమాలపై అధికారులు సీరియస్
- కొత్త టెక్నాలజీ ద్వారా ఈజీగా అందించేలా చర్యలు
- ముందుగా అధికారి అప్లికేషన్
- చెక్ చేసి మెసేజ్ పంపాకే సర్టిఫికెట్ జారీ
హైదరాబాద్, వెలుగు : ఇక ముందు బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం సిటిజన్స్ ఆఫీసులు, మీ సేవ సెంటర్ల చుట్టూ తిరగకుండా బల్దియా త్వరలో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేనుంది. ఇందుకు కొత్త సాఫ్ట్ వేర్ ను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సర్టిఫికెట్ల కావాలనుకునే సిటిజన్స్ నేరుగా స్మార్ట్ ఫోన్ల నుంచే అప్లై చేసుకునేందుకు వీలుగా టెక్నాలజీని తయారు చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అధికారులు వెరిఫికేషన్ చేశాక.. ఫోన్ కు మెసేజ్ వెళ్లడం, ఆ తర్వాత మీసేవకు వెళ్లి నామినల్ ఫీజు చెల్లించి ప్రింట్ తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఫేక్ సర్టిఫికెట్ల జారీకి కూడా చెక్ పడే చాన్స్ ఉంది. అయితే.. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారులు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే పని స్పీడప్ చేయనున్నారు.
ఎన్నిసార్లు సాఫ్ట్ వేర్ మార్చినా..
ఇప్పటికే పలుమార్లు బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు. అయిన కూడా ఫేక్ సర్టిఫికెట్ల జారీ ఆగడంలేదు. గతంలో 36 వేల ఫేక్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు సాఫ్ట్ వేర్ లో మార్పులు చేర్పులు చేశారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులు రావని, అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించాకే అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుందని అప్పట్లో చెప్పారు. దీంతో ఫేక్ సర్టిఫికెట్లకు చెక్ పెట్టవచ్చని కొత్త సాఫ్ట్ వేర్ ని అందుబాటులోకి తెచ్చారు. అయినా కూడా ఫేక్ సర్టిఫికెట్ల జారీ మాత్రం ఆగడంలేదు. ఇటీవల ఫలక్ నుమా సర్కిల్ లో నాన్ అవెలబిలిటీ కింద 60 సర్టిఫికెట్లు జారీ అయినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. అవన్ని ఒక్క మీసేవ సెంటర్ నుంచే అప్లై చేశారు. దీనిపై సీరియస్ అయిన కమిషనర్ సంబంధించి మీ సేవ సెంటర్ ఓనర్ తో పాటు ఓ బల్దియా అధికారితో పాటు అప్లై చేసిన వారితో కలిసి మొత్తం 42 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయినా కూడా ఫేక్ సర్టిఫికెట్లు జారీ అవుతూనే ఉన్నాయి. దీంతో తాజాగా బల్దియా మరో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
విజిలెన్స్ ఫోకస్..
బల్దియా ఇచ్చే బర్త్ , డెత్ సర్టిఫికెట్లపై విజిలెన్స్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఇందుకు సమగ్ర విచారణకు కమిషనర్ సైతం ఆదేశించారు. గతంలో కూడా బర్త్, డెత్ ఫేక్ సర్టిఫికెట్ల తీరుపై విజిలెన్స్ ఇన్ వాల్వ్ అయింది. మళ్లీ ఇటీవల జారీ అయిన సర్టిఫికెట్ల అక్రమాలపైనా విజిలెన్స్ విచారణ చేసి.. నివేదికను బల్దియా కమిషనర్ కు అందజేసినట్లు తెలిసింది. ప్రధానంగా ఫేక్ సర్టిఫికెట్లు ఫలక్ నుమా సర్కిల్ లో మాత్రమే జరిగాయా? లేక చార్మినార్ జోన్ అంతటా జరిగిందా..? అనే కోణంలో విచారణ జరిపినట్లు సమాచారం. అసలు, ఈ సమస్య ఎక్కడ ఏర్పడిందో , దానికి ఎలా చెక్ పెట్టాలో తెలుసుకునేందుకు విజిలెన్స్ విచారణ ఎంతో ఉపయోగపడనుంది. మొత్తంగా ఫేక్ బర్త్ , డెత్ సర్టిఫికెట్ల జారీని ఈసారి బల్దియా సీరియస్ గానే తీసుకుంది.