చందుర్తి, వెలుగు : నకిలీ సర్టిఫికెట్లతో రెండో పాస్ పోర్ట్ కు అప్లై చేసిన వ్యక్తితోపాటు నకిలీ పత్రాలు సృష్టించిన మీసేవ కేంద్రం నిర్వాహకుడిని రుద్రంగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలోని రూట్ల నాయక్ తండాకు చెందిన లూనావత్ రంజిత్ మండలకేంద్రంలో మీసేవా నిర్వహిస్తున్నాడు.
కథలాపూర్ మండలం కలికోట శివారు జారబండ తండాకు చెందిన ధారావత్ శర్వాన్ గతంలో గల్ఫ్ వెళ్లి పట్టుబడడంతో ఇండియాకు చేరుకున్నాడు. తిరిగి గల్ఫ్ వెళ్లాలని భావించి 15 రోజుల కింద రంజిత్ ను ఆశ్రయించాడు. నకిలీ ఆధార్ కార్డు సృష్టించి పదో తరగతి చదివినట్లు పాస్ పోర్టు కు దరఖాస్తు చేశాడు ఎంక్వైరీకి వచ్చిన ఎస్ బీ హెడ్ కానిస్టేబుల్ టెన్త్ సర్టిఫికేట్ తీసుకురావాలని సూచించగా
శర్వాన్ చదువుకోలేదని సమాధానమిచ్చాడు. అనుమానం వచ్చి పూర్తి వివరాలు చెక్ చేయగా పాత ఆధార్ కార్డు వివరాలు బయటపడ్డాయి. కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ కిరణ్ కుమార్ తెలిపారు.