ఎన్నికల ముందు రాష్ట్ర సర్కారు ప్రకటిస్తున్న వివిధ స్కీంలకు అప్లై చేసుకుంటున్న లబ్ధిదారులు సర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సొంత జాగ ఉన్నవాళ్లకు గృహలక్ష్మి కింద రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో క్యాస్ట్, ఇన్కం సర్టిఫికెట్ల కోసం మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ ఆఫీసులకు పరుగులు పెడుతున్నారు. రెవెన్యూ శాఖలో ఇటీవల జరిగిన మార్పులతో గ్రామ స్థాయిలో ఎంక్వైరీ చేసేందుకు సిబ్బంది లేరు.
దీంతో చాలా చోట్ల జనం ఒత్తిడిని తట్టుకోలేక తహసీల్దార్లు, ఆర్ఐలు విచారణ చేయకుండానే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇది అక్రమాలకు దారి తీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.వనపర్తి జిల్లాలోని 14 మండలాల్లో గృహలక్ష్మి కోసం 17 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇక సంబంధిత ఆఫీసర్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో గృహలక్ష్మి కింద గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించే పనిలో పడ్డారు.
- వనపర్తి/మరికల్, వెలుగు