- ఉమ్మడి పాలమూరు జిల్లాపై స్పెషల్ ఫోకస్
- ప్రజల్లోకి వెళ్తున్న పార్టీ క్యాడర్
- బీఆర్ఎస్ లీడర్లలో టెన్షన్
మహబూబ్‌నగర్, వెలుగు: ఎన్నికల ఇయర్ స్టార్ట్ కావడంతో టీడీపీ ఉమ్మడి పాలమూరు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడంతో జిల్లా క్యాడర్ యాక్టివ్ మోడ్‌లోకి వస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు ‘ఇంటింటికి టీడీపీ’ పేరుతో కార్యక్రమాలను షురూ చేసింది. దశాబ్దం కింద ఉమ్మడి పాలమూరు జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2009లో జిల్లాను శాసించిన టీడీపీ, తెలంగాణ ఉద్యమం కారణంగా క్రమంగా తన ఉనికిని కోల్పోతూ వచ్చింది.
గతంలో టీడీపీ హవా..
2009 ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి, నారాయణపేట నుంచి ఎల్లారెడ్డి, మక్తల్ నుంచి దయాకర్‌రెడ్డి, దేవరకద్రలో సీతమ్మ, జడ్చర్లలో ఎర్ర శేఖర్, కల్వకుర్తిలో జైపాల్‌యాదవ్, అచ్చంపేటలో పి రాములు, నాగర్‌కర్నూల్‌లో నాగం జనార్ధన్‌రెడ్డి, వనపర్తి నుంచి రావుల చంద్రశేఖర్‌రెడ్డి సైకిల్ గుర్తు మీద గెలిచారు. నడిగడ్డలోనూ బలమైన క్యాడర్ ఉన్నా.. అక్కడ సత్తా చాటలేకపోయారు. 2009 ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమం జరగడం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ పార్టీకి నష్టం జరిగింది. 2014లో జరిగిన ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి, నారాయణపేట నుంచి ఎస్ రాజేందర్‌రెడ్డి మాత్రమే గెలుపొందారు. 2018లో కొన్ని స్థానాల్లో పోటీ కూడా చేయలేదు. క్యాడర్ కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్లింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్లో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లంతా టీడీపీ నుంచి వచ్చిన వారే. ఇటీవల రాష్ట్ర సర్కారు మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో రాజకీయాలు మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో టీడీపీ మళ్లీ బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీకి పట్టున్న జిల్లాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ చీఫ్ సూచించగా, అందులో ఉమ్మడి పాలమూరు జిల్లా కూడా ఉన్నట్లు సమాచారం.
‘ఇంటింటికీ టీడీపీ’ పేరుతో ప్రజల్లోకి..
ఉమ్మడి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమవుతోంది. ఇప్పటికే జడ్చర్ల, దేవరకద్ర, కొడంగల్, షాద్‌నగర్‌లలో అసెంబ్లీ కోఆర్డినేటర్లుగా సత్యం గౌడ్, జనార్ధన్, వెంకటప్రసాద్, బక్కని నర్సింహులు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఇన్చార్జిగా మెట్టుగాడి శ్రీనివాసులును నియమించింది. ప్రస్తుతం వీరి ఆధ్వర్యంలో ‘ఇంటింటికి టీడీపీ’ పేరుతో మూడు రోజుల కింద కార్యక్రమాలను ప్రారంభించింది. ఆ తరువాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముగింపు సభకు పార్టీ చీఫ్ చంద్రబాబు కూడా వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ కూడా..
శక్తి కేంద్రాలు, బూత్ స్థాయి మీటింగులు, కార్నర్ మీటింగులతో బీజేపీ గ్రామ స్థాయి నుంచి కార్యక్రమాలను చేపడుతోంది. ‘హాత్ సే హాత్’ యాత్రతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే రెండు పార్టీల లీడర్లు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేస్తున్నారు. పార్టీల్లోని కొందరు లీడర్లు స్వయంగా పాదయాత్రలు చేస్తున్నారు. ఒక రోజంతా ఊళ్లలోనే బస చేసి, రాత్రిళ్లు ప్రజలతో చిట్ చాట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ప్రజలకు దగ్గరవ్వడంతో పాటు స్థానిక సమస్యలపై పట్టు సాధించేందుకు ఆస్కారం ఉండడంతో చాలా మంది లీడర్లు పాదయాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
డిఫెన్స్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు..
ప్రతిపక్షాలు యాక్టివ్ మోడ్‌లోకి రావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు డిఫెన్స్‌లో పడ్డారు. అపోజిషన్ లీడర్లు నిత్యం ప్రజల మధ్యే తిరుగుతూ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై ఆరోపణలు చేస్తుండడంతో తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని టెన్షన్లో ఉన్నారు. నాలుగు రోజుల కింద మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ ప్రెస్మీట్లో రూలింగ్ పార్టీ లీడర్‌పై హాట్ కామెంట్స్ చేయగా, కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీఆర్ఎస్ లీడర్ వెంటనే ప్రెస్మీట్లో మాట్లాడిన బీజేపీ లీడర్ సామాజికవర్గం భవన నిర్మాణానికి హామీ ఇవ్వడం గంటల్లోనే జరిగిపోయాయి. రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందోననే భయంతోనే ఆ ముఖ్య నేత గంటల వ్యవధిలోనే స్పందించినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.