
నెల 25 నుంచి మే 30 వరకు రాజ్యాంగ పరిరక్షణపై ప్రోగ్రామ్స్
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా డీసీసీ (డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్‌ల నియామకాన్ని మే 31 వరకు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ నెల 25 నుంచి మే 30 వరకు రాజ్యాంగ పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. శనివారం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, అనుబంధ సంస్థ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. డీసీసీలను బలోపేతం చేయాలని అహ్మదాబాద్‌లో జరిగిన పార్టీ కీలక మీటింగ్‌లో నిర్ణయించామన్నారు. ఆ తీర్మానం ప్రకారం సామాజిక, ఆర్థిక న్యాయం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇందులో భాగంగా ఈ నెల 25 నుంచి 30 వరకు ర్యాలీలు, మే 3 నుంచి 10 వరకు జిల్లా స్థాయిలో, మే 11 నుంచి 17 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. మే 20 నుంచి 30 వరకు ఇంటింటికీ వెళ్లి బీజేపీ చేస్తున్న అరాచకం, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవశ్యకత, దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్ష నేతలపై పెడుతున్న అక్రమ కేసుల విషయాన్ని వివరిస్తామన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు.
మోదీ, షాలది క్రిమినల్ మైండ్‌సెట్..
ప్రధాని మోదీ, అమిత్ షాలది క్రిమినల్ మైండ్‌సెట్ అని ఖర్గే మండిపడ్డారు. కాంగ్రెస్ అధినాయకత్వంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను అక్రమంగా చార్జ్‌షీట్‌లో చేర్చారని అన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. దీనిపై ఈ నెల 21 నుంచి 24 వరకు మీడియా సమావేశాలు పెట్టి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాయని, ఈ విషయంలో సుప్రీంకోర్టులో న్యాయం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.