జిల్లా అధ్యక్షుల ఎంపికలో బీజేపీలో కుదరని ఏకాభిప్రాయం

జిల్లా అధ్యక్షుల ఎంపికలో బీజేపీలో కుదరని ఏకాభిప్రాయం
  • పెండింగ్​లో మరో 10 జిల్లాల ప్రెసిడెంట్లు 
  • డిసెంబర్ నుంచి పెండింగ్​లోనే ప్రక్రియ 

హైదరాబాద్, వెలుగు: భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. డిసెంబర్ లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావించిన కమలం పార్టీకి.. నేతల మధ్య ఆధిపత్య పోరుతో తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా 38 జిల్లాలుగా మార్చుకున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో 28 జిల్లాలకు అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. వివిధ కారణాలతో మేడ్చల్ అర్బన్, రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్, వికారాబాద్, భాగ్యనగర్– మలక్ పేట్, కరీంనగర్, నాగర్ కర్నూల్, ఖమ్మం, గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షుల పేర్లను పెండింగ్​లో పెట్టారు. 

కొన్ని జిల్లాలకు నామినేషన్లను స్వీకరించి.. పేర్లు ఫైనల్ చేసినా వాటిని అధికారికంగా ప్రకటించలేదు. కరీంనగర్, గద్వాల, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో ఇప్పటికే రెండుసార్లు ఆ బాధ్యతలు నిర్వహించిన వారు ఉండటంతో.. అక్కడి వారిని మార్చే ఆలోచన చేస్తున్నారు. వికారాబాద్​లో ఓ లీడర్​ను జిల్లా అధ్యక్షుడిగా నియమించాలనే భావనలో ఉన్నా.. టెక్నికల్ సమస్యలు అడ్డుగా ఉన్నట్టు నేతలు చెప్తున్నారు. 

రంగారెడ్డి రూరల్, అర్బన్, భద్రాద్రిలో పోటీ ఎక్కువగా ఉందని నేతలు పేర్కొంటున్నారు. అందులో కొందరు తమ వర్గానికి చెందిన వారికే ఇవ్వాలని డిమాండ్​చేస్తుండడంతో వాటిని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. అయితే, ప్రకటించిన జిల్లాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా బహిరంగంగానే విమర్శలు చేయగా.. నల్గొండలో బండి సంజయ్ కార్యక్రమంలో ఆందోళనలు చేశారు. పలు జిల్లాల్లో ప్రెసిడెంట్లను మార్చాలని స్టేట్ ఆఫీసుకు కూడా వస్తున్నారు. 

మహిళలు ఇద్దరే..

ఇప్పటి వరకు బీజేపీ 28 జిల్లాలకు ప్రెసిడెంట్లను ప్రకటించగా.. అందులో ఇద్దరు మాత్రమే మహిళలు ఉన్నారు. సంగారెడ్డిలో గోదావరి,  సూర్యాపేటలో శ్రీలత రెడ్డిని నియమించారు.  శ్రీలతరెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. వీరితో పాటు మిగిలిన పది జిల్లాల్లో ఒకరిద్దరిని అధ్యక్షులుగా నియ మించే అవకాశం ఉంది. కాగా, ప్రకటించిన వారిలో16 మంది బీసీలు ఉండగా, వారిలో ఐదుగురు మున్నూరుకాపు, నలుగురు గౌడ్స్, ముగ్గురు ముదిరాజ్, యాదవ, పద్మశాలి, జంగం, వాల్మికిబోయ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. 9 మంది ఓసీలుండగా, వారిలో 8 మంది రెడ్డిలున్నారు. మరో ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ ఉన్నారు.