హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూధన్ రావు, జస్టిస్ రేణుకా యార, నర్సింగ్ రావులను హైకోర్టు జడ్జిలుగా నియమిస్తూ 2025, జనవరి 22న రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల దేవి వచ్చే ఏడాది జూన్ 1 వరకు.. రేణుకా యార, నర్సింగ్ రావు నందికొండ, మధుసూధన్ రావులు రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
2025 జనవరి 11న జరిగిన భేటీలో నలుగురు జిల్లా కోర్టు జడ్జిలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. జిల్లా జడ్జిల కోటాలో సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యారా, సిటీ సివిల్ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నందికొండ నర్సింగ్‌రావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇ.తిరుమలాదేవి, హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) బి.ఆర్.మధుసూదన్‌రావు పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం పరిశీలన అనంతరం సుప్రీం కోర్టు కొలిజియం సిఫారసులకు బుధవారం (జనవరి 22) రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ నలుగురని హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది