నల్గొండలో కొత్త ఎస్‌‌ఎంసీలు ఇప్పట్లో లేనట్లే..!

  • 2019 నుంచి పాత కమిటీలే కొనసాగింపు
  •     ఇప్పటికే మూడు సార్లు పదవీ కాలాన్ని పెంచిన ప్రభుత్వం
  •     గత నెల 31తో గడువు ముగిసినా మరో ఆరు నెలలు పొడిగింపు

సూర్యాపేట/యాదాద్రి, వెలుగు: కొత్త స్కూల్ మేనేజ్‌‌మెంట్‌‌ కమిటీ (ఎస్‌‌ఎం‌‌సీ)ల నియామకం మరోసారి పెండింగ్‌‌లో పడింది. 2019 నుంచి పాత కమిటీలను కొనసాగిస్తున్న సర్కారు ఇప్పటికే మూడు సార్లు పదవీ కాలాన్ని పొడగించింది. తాజాగా గతనెల 31తో  గడువు ముగిసినా..  మరో ఆరు నెలలు పొడిగిస్తూ  స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.  దీంతో పాత సర్కారే కాదు కొత్తగా ఏర్పడిన సర్కారు కూడా కొత్త కమిటీల నియామకం ఇప్పట్లో లేనట్లేనని హింట్ ఇచ్చింది. 

బడుల బలోపేతంలో ఎస్‌‌ఎంసీలు కీలకం 

సర్కారు బడుల బలోపేతంతో పాటు స్కూళ్లకు మంజూరైన ఫండ్స్ సక్రమంగా వినియోగించడంలో స్కూల్ మేనేజ్‌‌మెంట్ కమిటీల పాత్ర కీలకం.  గత సర్కారు 2019లో ఎస్‌‌ఎంపీలను ఏర్పాటు చేసింది.   ఈ కమిటీల్లో ప్రైమరీ స్కూల్‌‌లో 15మంది, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 21మంది, హైస్కూల్‌‌లో 15మంది సభ్యులుగా ఉంటారు. వీరి నుంచి చైర్మన్‌‌, వైస్‌‌ చైర్మన్‌‌ను ఎన్నుకుంటారు.  

స్కూల్ ప్రిన్సిపాల్ కన్వీనర్‌‌‌‌గా కొనసాగుతారు. ఈ కమిటీ బడీడు పిల్లలను బడిలో చేర్పించడం, స్టూడెంట్ల హాజరు శాతం పెంచడంతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా..?  టీచర్లు సక్రమంగా హాజరు అవుతున్నారా..?  లేదా..? పర్యవేక్షిస్తుంది.  స్కూల్ డెవలప్‌‌మెంట్‌‌ కోసం ఫండ్స్ కావాలన్నా.. రిలీజైన ఫండ్స్‌‌తో  పనులు చేపట్టాలన్నా తీర్మానం చేయాల్సి ఉంటుంది.  

లక్ష్యం నెరవేరట్లే..

ఎస్‌‌ఎంసీల పదవి కాలం రెండేండ్లు ఉంటుంది. ఈ లెక్కన 2019లో ఏర్పాటైన  ఎస్‌‌ఎం‌‌సీల గడువు 2021తో ముగియాలి. కానీ గత ప్రభుత్వం ఆరు నెలల చొప్పున మూడుసార్లు పదవీ కాలాన్నీ పొడిగిస్తూ వచ్చింది.

గత నెల 31తో గడువు ముగియగా..  కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కమిటీలను నియమిస్తుందని భావించారు. కానీ, కాంగ్రెస్ సర్కారు కూడా మరో ఆరు నెలలు పదవి కాలాన్ని పొడిగించింది.  దీంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. వాస్తవానికి  స్కూల్‌‌లో చదివే స్టూడెంట్స్ పేరెంట్స్ సభ్యులుగా ఉండాలన్న రూల్‌‌ ఉంది.  కానీ, 2019 లో ఏర్పడ్డ కమిటీలో ఉన్న సభ్యులు పిల్లలు ప్రైమరీ, అప్పర్‌‌‌‌ ప్రైమరీ, హైస్కూళ్లలో తరగతులు పూర్తి చేసి ఇతర స్కూళ్లకు వెళ్లారు.  

కానీ, వీళ్ల పేరెంట్స్ మాత్రం కమిటీ చైర్మన్‌‌, వైస్‌‌ చైర్మన్‌‌, సభ్యులుగా కొనసాగుతున్నారు. దీంతో వాళ్లు స్కూళ్లను సరిగ్గా పట్టించుకోడం లేదని, స్కూల్ డెవలప్‌‌మెంట్‌‌లోనూ అనేక ఇబ్బందులు వస్తున్నాయని టీచర్లు చెబుతున్నారు.  మౌలిక వసతులు కల్పనకు కూడా చర్యలు తీసుకోవడం లేదని, కొన్ని స్కూళ్లలో తీర్మానాలు కూడా చేయడం లేదని వాపోతున్నారు.

ప్రభుత్వం గడువు పెంచింది 


ఎస్‌‌ఎంసీల పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చే వరకు పాత కమిటీలే కొనసాగుతాయి. 2019 నుంచి పాత కమిటీలే నడుస్తున్నాయి. స్కూళ్ల అభివృద్ధి విషయంలో సమన్వయం చేస్తున్నం.  
- శ్రవణ్ కుమార్, ఎస్‌‌వో, 
సూర్యాపేట జిల్లా 

ఉమ్మడి జిల్లాలో 3,473 స్కూళ్లు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,473 స్కూల్స్​ఉన్నాయి. నల్గొండ జిల్లాలో  1,126 ప్రైమరీ, 128 యూపీఎస్​, 229 హైస్కూల్స్​మొత్తం 1,483 స్కూల్స్​,  సూర్యాపేట జిల్లాలో  710 ప్రైమరీ స్కూల్స్, 174 యూ‌‌పీ‌‌ఎస్, 309 హై స్కూల్స్ మొత్తం 1,274   స్కూల్స్ ఉన్నాయి.  యాదాద్రి జిల్లాలో 481 ప్రైమరీ స్కూల్స్, 68 యూపీఎస్, హై స్కూల్స్ 163 మొత్తం 712 స్కూల్స్ ఉన్నాయి.