- ఏపీకి ఇద్దరిని నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం
- 25న ప్రమాణ స్వీకారం
- తెలంగాణ హైకోర్టులో 30కు చేరిన జడ్జీల సంఖ్య
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు ఆరుగురు కొత్త జడ్జిలు నియమితులయ్యారు. సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను ముందుగా కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేయడంతో బుధవారం కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఏపీ హైకోర్టుకు ఇద్దరు జడ్జిలను నియమించింది. వీరంతా జ్యుడీషియల్ సర్వీస్‌లో ఉన్న న్యాయాధికారులే. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యారా, సిటీ సివిల్ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నందికొండ నర్సింగ్‌రావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎడ తిరుమలాదేవి, హైకోర్టు పరిపాలన విభాగం రిజిస్ట్రార్ బొబ్బిలి రామయ్య మధుసూదన్‌రావు తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా నియ మితులయ్యారు.
ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా ఉన్న డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు ఏపీ హైకోర్టుకు జడ్జిలు అయ్యారు. తెలంగాణ హైకోర్టులో ఈ నెల 25న కొత్త జడ్టీలతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణ హైకోర్టులో చీఫ్ జస్టిస్ బదిలీ తర్వాత ఇప్పుడు 26 మంది జడ్జీలు ఉండగా కొత్తవాళ్లు వస్తే ఆ సంఖ్య 30కి చేరుతుంది. ఏపీలో చీఫ్ జస్టిస్‌తో కలిపి ఇప్పుడు 28 మంది ఉండగా కొత్త వాళ్లు ప్రమాణస్వీకారం చేస్తే అక్కడి హైకోర్టు జడ్జిల సంఖ్య 30కి పెరుగుతుంది.