హైదరాబాద్: ప్రజాభీష్టానికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అనుమతులు ఇచ్చిన దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసిన సర్కారు.. లగచర్ల రైతుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఫార్మాపై వెనక్కి తగ్గింది. ఈ మేరకు భూసేకరణ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూ సేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం ఉపసంహరించుకున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాలలో ప్రజల అభిప్రాయ సేకరణ తర్వాత భూసేకరణ రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు.
ఆయా గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది. అప్పటి మంత్రి తలసాని కుటుంబం కోసం ఆగమేఘాలపై ఫ్యాక్టరీకి సాక్షాత్తూ కేసీఆరే అనుమతులు ఇప్పించారని ప్రభుత్వం చెబుతోంది. పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వని ఉత్పత్తులకు ఆయనే కేబినేట్‌ను ఒప్పించారని తెలిపింది. ఈ ఫ్యాక్టరీకి మినహాయింపులు ఇవ్వాలని కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి చేశారని చెబుతోంది.
ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఎంక్వెరీ రిపోర్టులో నిబంధనలను తుంగలో తొక్కి గత ప్రభుత్వం అనేక మినహాయింపులతో కూడిన అనుమతి ఇచ్చినట్టు తేలింది. పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కంపెనీ ఉల్లంఘించినట్లు వెల్లడైంది. ఫ్యూయల్ ఇథనాల్ సాకును చూపించి ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మినహాయింపు పొందేందుకు ఈ కంపెనీ అడ్డదారులు అనుసరించిందని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నివేదికలో వెల్లడైంది.
కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్‌కు అనుమతి ఇస్తే.. అదేమీ పట్టించుకోకుండా ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ లాంటి అన్ని ఉత్పత్తులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గంలో అనుమతులు ఇచ్చారని తేలింది. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు పరిణామాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్ నిర్వాసితులను ఇబ్బంది పెట్టిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.
దౌర్జన్యంగా భూములు లాక్కోవడం.. పోలీసు బలాన్ని ప్రయోగించి సంతకాలు తీసుకోవడం.. గ్రామాలను ఖాళీ చేయించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ వేధింపులకు బాధితులు సామూహిక ఆత్మహత్యలకు సిద్ధమైన విషయాన్ని యాది చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించేందుకు ఏకంగా నిర్వాసితులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేసిన సంఘటన కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అప్పటి బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును పోల్చుకుంటున్నారు. ప్రజల అభీష్టాన్ని గౌరవించి వెనక్కి తగ్గడం ఆహ్వానించదగిన పరిణామమని అంటున్నారు.