రూ. 50.77 కోట్లతో భువనగిరి మున్సిపల్‌ బడ్జెట్‌

  • బీఆర్‌ఎస్‌ నుంచి 14 మంది, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి 16 మంది హాజరు
  • ఓటింగ్‌ కోరకుండా పరోక్షంగా సహకరించిన ప్రతిపక్ష కౌన్సిలర్లు

యాదాద్రి, వెలుగు : అధికార పార్టీకి తగినంత బలం లేకపోయినా, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఓటింగ్‌ డిమాండ్‌ చేయకపోవడంతో యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపల్‌ బడ్జెట్‌కు ఆమోదం లభించింది. బడ్జెట్‌ మీటింగ్‌ను వాయిదా వేయాలంటూ ఓటింగ్‌ కోరే అవకాశం, అందుకు సరిపోయేంత మంది సభ్యులు ఉన్నా ప్రతిపక్షాలు పట్టించుకోలేదు. దీంతో భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి రూ. 50.77 కోట్లతో రూపొందించిన 2023 – 24 బడ్జెట్‌ ఆమోదం పొందినట్లు ఆఫీసర్లు ప్రకటించారు.

నలుగురు అధికార పార్టీ కౌన్సిలర్లు డుమ్మా

యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ బడ్జెట్‌ మీటింగ్‌ సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది.  చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులుపై అసంతృప్తిగా ఉన్న బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు నాయిని అరుణ, దిడ్డికాడి భగత్, గుండెగల్ల అంజమ్మ, అజీమ్‌ మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. దీంతో బీఆర్‌ఎస్‌ తరఫున 14 మంది, బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి 16 మంది హాజరయ్యారు. మీటింగ్ ప్రారంభం కాగానే అవిశ్వాసం నోటీసు ఇచ్చినందున సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రతిపక్ష కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. తమకు చెప్పకుండా, తీర్మానాలు చేయకుండా వార్డుల్లో పనులు చేస్తూ కౌన్సిలర్లను అవమానపరుస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ. 17.50 కోట్లతో చేపట్టే పనులను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు అంటే గౌరవం లేదు కాబట్టి మీటింగ్‌ను వాయిదా వేయాలని డిమాండ్​ చేశారు. 

ఓటింగ్‌ కోరకుండా పరోక్ష సహకారం

మీటింగ్‌ వాయిదా వేయాలని ప్రతిపక్ష లీడర్లు ఓ వైపు గొడవ చేస్తుండగానే, మరో వైపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే అధికార పార్టీ సభ్యుల కంటే ప్రతిపక్ష సభ్యులు ఇద్దరు ఎక్కువగానే ఉన్నారు. అయినా ప్రతిపక్షాలు ఓటింగ్‌కు డిమాండ్‌ చేయకపోవడంతో బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు. ఒకవేళ ఓటింగ్‌ కోసం ప్రతిపక్ష లీడర్లు పట్టుబట్టినట్లయితే బడ్జెట్‌ ఆమోదం పొందకపోయేది. కానీ అలాంటిదేమీ లేకపోవడంతో బడ్జెట్‌కు ప్రతిపక్షాలు పరోక్షంగా సహకరించినట్లు అయింది. అయితే దీని వెనుక బీఆర్‌ఎస్‌ పెద్దల హస్తం ఉందన్న విమర్శలు 
వినిపిస్తున్నాయి.

‘ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే’

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ మాయ దశరథ ఆరోపించారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ కిషయ్యపై మెజార్జీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారని, బడ్జెట్​ మీటింగ్‌కు నలుగురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు గైర్హాజర్‌ అయ్యారని తెలిపారు. తాము బడ్జెట్​ మీటింగ్ వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తుంటే ఆమోదం పొందినట్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. 

అడిషనల్‌ కలెక్టర్‌కు వినతి

బడ్జెట్‌ ఆమోదం పొందిన తర్వాత బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మున్సిపల్‌ ఆఫీస్‌ నుంచి వెళ్లిపోయారు. బీజేపీ, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మాత్రం మీటింగ్‌ వాయిదా వేయాలంటూ అక్కడే బైఠాయించారు. ఇదే టైంలో మున్సిపల్‌ ఆఫీస్‌కు వచ్చిన అడిషనల్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారిని అడ్డుకున్నారు. మీటింగ్‌ వాయిదా వేసినట్లు ప్రకటించాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై కలెక్టర్‌తో మాట్లాడి స్పష్టత ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మున్సిపల్​కమిషనర్‌ నాగిరెడ్డితో కలిసి కలెక్టర్‌ పమేలా సత్పతిని కలిసి మున్సిపాలిటీలో జరిగిన పరిణామాలను వివరించారు. కోరం ఉన్నందున మీటింగ్‌ కొనసాగిందని, బడ్జెట్‌ పెట్టిన టైంలో 30 మంది కౌన్సిలర్లు ఉండడం, ఓటింగ్​ కోరకపోవడం వల్ల బడ్జెట్‌కు ఆమోదం పొందినట్టేనని వివరించారు.