అప్రూవల్ సరే.. పనులు ఎక్కడ?

అప్రూవల్ సరే.. పనులు ఎక్కడ?
  • బల్దియా స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన పనులు షురూ అయితలే
  • పెరుగుతోన్న అప్పులు.. నిధులు లేకపోవడమే  కారణమా?
  • టెండర్ల ఫైళ్లనూ  పట్టించుకోని అధికారులు


హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో అభివృద్ధి పనులు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో అప్రూవల్​కే పరిమితం అవుతున్నాయి. ప్రతి వారం జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం లేదు.  గతంలో స్టాండింగ్ కమిటీ అప్రూవల్​ వచ్చిన కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభమయ్యేవి. కానీ ఇప్పుడు ఐదారు నెలలు, కొన్ని పనులు ఏడాదైనా  షురూ కావడం లేదు. గతంలో బల్దియా ఖాజానాలో కావాల్సినంత  నిధులు ఉండటంతో అనుకున్న పనులు ఇన్ టైమ్​లో జరిగేవి. ప్రస్తుతం అప్పులు పెరిగిపోవడంతో పాటు నిధులు లేక పనులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డువస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని పనులు అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమవుతున్నట్లు సమాచారం.  కొన్ని పనులు నెమ్మదిగా జరుగుతుండటంతో  జనం ఇబ్బంది పడుతున్నారు.  ఒక్కసారి  స్టాండింగ్ కమిటీ ఆమోదించిన అనంతరం వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. అనేక కారణాలతో అధికారులు వెంటనే పనులను ప్రారంభించలేకపోతున్నారు.

అన్నీ అంతే.. 

రోడ్లు,  బ్రిడ్జిలు, మల్టీపర్పస్​ ఫంక్షన్ హాల్స్, శ్మశాన వాటికలు ఇలా అన్ని పనులూ  పెండింగ్​లో ఉన్నాయి.  టెండర్ల ప్రక్రియ కోసం బల్దియా హెడ్డాఫీసుకు వచ్చిన ఫైళ్లను కూడా అధికారులు పట్టించుకోవడం  ఏదో కారణంతో కొన్నాళ్ల పాటు పనులను వాయిదా వేస్తూనే ఉన్నారు. కార్పొరేటర్లు, జనం నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారే తప్ప పనులు మొదలుపెట్టడం  లేదు. 

10 సమావేశాలు జరిగితే....

ప్రస్తుత స్టాండింగ్​ కమిటీ ఏర్పడిన తర్వాత మొదటి సమావేశం కిందటేడాది డిసెంబర్ 8న జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 10 సమావే శాలు జరిగాయి.  దాదాపు 150 కిపైగా పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు. కానీ  వందలోపు పనులు ఇప్పటికీ మొదలు కాలేదని సమాచారం.  ఒక్కసారి అప్రూవల్​ ఇచ్చిన తర్వాత తిరిగి పనులు జరుగుతున్నాయా? లేదా అన్న దానిపై మరోసారి చర్చిండం లేదు. గత స్డాండింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించిన తర్వాతే కొత్త వాటికి ఆమోదం తెలపాలి. కానీ అలా జరగడం లేదని తెలుస్తోంది.  

  •       కిందటేడాది డిసెంబర్ 15న జరిగిన స్టాండింగ్ కమిటీ రెండో సమా వేశంలో ఉప్పుగూడ మహంకాళి టెంపుల్ వద్ద  రూ. 4.96 కోట్లతో మల్టీ పర్పస్  ఫంక్షన్ హాల్ నిర్మాణానికి  సభ్యులు ఆమోదం తెలిపారు. 3 ఫ్లోర్లతో ఫంక్షన్ హాల్​కు అప్రూవల్​ వచ్చినా... పనులు మాత్రం ఇప్పటికీ మొదలుకాలేదు. టెండర్ ప్రాసెస్ సైతం పూర్తికాలేదు. 
  •      నాంపల్లిలో  సరాయిని తొలగించి, దాని స్థానంలో రూ. 11 కోట్లతో ప్యాసింజర్లకు వసతి గృహాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనలను గత డిసెంబర్ 8న జరిగిన తొలి స్డాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు ఆమోదించారు. నాంపల్లి రైల్వే స్టేషన్​కు  వచ్చే  ప్యాసింజర్లకు ఇది ఉపయోగపడుతుందని నిర్ణయించారు. కానీ నేటికి పనులు మాత్రం మొదలుపెట్టలేదు. 

బ్రిడ్జిలు ఏమైనయ్....

ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో  రద్దీని తగ్గించేందుకు ఫ్లై ఓవర్లు, రోడ్ల వైడెనింగ్​, ఫుట్​ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి  స్టాండింగ్ కమిటీలో అప్రూవల్​ వచ్చిన కూడా పనులు మొదలుపెట్టడం లేదు. అసలు స్డాండింగ్​ కమిటీలో ఒక్కసారి క్లియరెన్స్​ వచ్చిన తర్వాత ఆగకుండా పనులు జరగాలె.  ఏడాది, రెండేళ్లయినా కూడా పనులు చేయకపోతే స్డాండింగ్ కమిటీ ఇంకెందుకు? ఇప్పటికైనా పనులను మొదలుపెట్టాలి. పెండింగ్​లో వాటిని తొందరగా పూర్తి చేయాలి.   – తోకల శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్, మైలార్​దేవ్ పల్లి డివిజన్

 

 

 

ఇవి కూడా చదవండి

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం

ప్లంబర్​ శైలజ ఇన్​స్పిరేషనల్​ జర్నీ..

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు