ఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ పై గొడవేంటి.. కొందరు అభ్యర్థులు పరీక్ష ఎందుకు రాయలేదు..

ఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ పై గొడవేంటి.. కొందరు అభ్యర్థులు పరీక్ష ఎందుకు రాయలేదు..

ఏపీలో గ్రూప్ 2 పరీక్షలపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.. పరీక్షలు వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున అభ్యర్థులు రోడ్డెక్కటం ఉద్రిక్తతకు దారి తీసింది. అభ్యర్థులు ఆందోళనకు దిగినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో ఇవాళ ( ఫిబ్రవరి 23, 2025 ) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యధాతధంగా జరిగాయి. అయితే.. ఆందోళన చేపట్టిన చాలామంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవ్వలేదు. ఇంతకీ గ్రూప్ 2 పరీక్షల విషయంలో నెలకొన్న గందరగోళం ఏంటి.. కొంతమంది అభ్యర్థులు పరీక్ష ఎందుకు దూరంగా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

రోస్టర్ విధానంలో లోపాలు.. అభ్యర్థుల ఆందోళన

గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన  గ్రూప్ 2 నోటిఫికేషన్ లో రోస్టర్ విధానంలో పొరపాట్లు జరిగాయని మొదటి నుంచి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పరీక్ష తేదీ దగ్గర పడిన క్రమంలో శనివారం ( ఫిబ్రవరి 22 ) పెద్ద ఎత్తున అభ్యర్థులు విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా అబ్యర్ధుల వైపే నిలిచింది. రోస్టర్ విధానంలో చోటు చేసుకున్న పొరపాట్లను సరిచేయాలని అప్పట్లో డిమాండ్ చేసింది టీడీపీ. 

అప్పటి వైసీపీ ప్రభుత్వం రోస్టర్ విధానంలో పొరపాట్లు సరిచేస్తామని పేర్కొన్నప్పటికీ ఎన్నికల కోడ్ రావడంతో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ సైడ్ అయిపోయింది.ఎన్నికలకు ముందు అభ్యర్థుల తరపున నిలిచిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ అంశాన్ని పట్టించుకోలేదు. రోస్టర్ విధానంలో పొరపాట్లను సరిచేయకుండానే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహణకు సిద్దపడింది కూటమి ప్రభుత్వం.

గ్రూప్ 2 నోటిఫికేషన్లో జీవో 77 అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ జీవో నంబర్ 77లో మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయొద్దని ఉన్నప్పటికీ... గ్రూప్-2 నోటిఫికేషన్ లో మహిళకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఇలా రోస్టర్ విధానంలో మహిళలకు, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు రోస్టర్ పాయింట్స్ అదనంగా ఇచ్చారన్నది అభ్యర్థుల వాదన. 

హైకోర్టు కూడా రోస్టర్ విధానంలోని పొరపాట్లను సరి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చిందని.. కానీ ప్రభుత్వం అదేమీ చేయకుండా పరీక్షల నిర్వహించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్పటి వైసీపీ ప్రభుత్వం  899 పోస్టులు భర్తీ చేసేందుకు  2023 డిసెంబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష కూడా నిర్వహించింది వైసీపీ ప్రభుత్వం. ఆ తరువాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మెయిన్స్ పరీక్ష ఆగిపోయింది. మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష హాజరవ్వాల్సి ఉండగా..  రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 175 కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.