ఏపీ జలదోపిడి..అట్లయితే తెలంగాణకు నీళ్లు కష్టమే

ఏపీ జలదోపిడి..అట్లయితే తెలంగాణకు నీళ్లు కష్టమే

హైదరాబాద్, వెలుగు:  కృష్ణా నీళ్ల విషయంలో ఏపీ దోపిడీ ఆగడం లేదు. సాగర్ కుడి కాల్వ నుంచి నీటి విడుదలను 5 వేల క్యూసెక్కులకు తగ్గించుకోవాలని నెల కింద జరిగిన కృష్ణా బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌లో నిర్ణయం జరిగినప్పటికీ, ఆ రాష్ట్రం మాత్రం అది పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ సాగర్​కుడి కాల్వ నుంచి రోజుకు 6 వేల నుంచి 8 వేల  క్యూసెక్కుల నీళ్లను తరలించుకుపోతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 13 టీఎంసీల దాకా అడ్డదారిలో ఎత్తుకెళ్లింది. ఈ నెల 13 నుంచే ఏపీ తాము తీసుకునే నీళ్లను 5 వేల క్యూసెక్కులకు తగ్గించుకోవాల్సి ఉన్నా, ఆ రాష్ట్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సగటున రోజూ 7 వేల క్యూసెక్కులను తరలించుకుపోతున్నది.  బోర్డు మీటింగ్​ జరిగిన ఫిబ్రవరి 27 నాటికి వాడుకోవాల్సిన నీళ్లు ఏపీకి కేవలం 27 టీఎంసీలే ఉండగా.. అందులో దాదాపు సగం ఇప్పటికే వాడేసుకున్నది. మరోవైపు సాగర్ టెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండ్ నుంచి కూడా 4 టీఎంసీలను తరలించుకుపోయింది. 

అట్లయితే మనకు నీళ్లు కష్టమే.. 

సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నీటి మట్టం 510 అడుగల దిగువకు వెళ్తే.. మనం నీటిని తీసుకునేందుకు అక్కడ ప్రత్యేకంగా మోటార్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దానికి తోడు కరెంట్​సరఫరా కోసం ఓ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసుకుంటే గానీ పని జరగదంటున్నారు. అంతేగాకుండా 510 అడుగుల దిగువకు వెళ్లాక అక్కడి వరకు వెళ్లేందుకు సరైన బాట కూడా ఉండదని, యాక్సెస్​తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాంటి చోటుకు మోటార్లను తీసుకెళ్లాలన్నా, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలన్నా కష్టమవుతుందని అంటున్నారు. పైగా వాటికి మనమే మళ్లీ అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఏపీ మాత్రం ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఖర్చు లేకుండా వట్టి పుణ్యానికి నీళ్లు తీసుకెళ్తే.. తాము మాత్రం అన్ని కష్టాలు పడుతూ, ఖర్చు పెట్టుకుంటూ నీటిని ఎందుకు తీసుకెళ్లాలన్న ప్రశ్నలను అధికారులు లేవనెత్తుతున్నారు.