ఎస్ఎల్​బీసీ పూర్తయ్యేవరకే.. ఏఎంఆర్​పీ నుంచి నీళ్లు తీస్కోవాలి : ఏపీ సాక్షి ఏకే గోయల్​

  • ఆ రెండూ షెడ్యూల్11 ప్రాజెక్టుల జాబితాలో లేవు: ఏపీ సాక్షి ఏకే గోయల్​
  • నెట్టెంపాడును ప్రొటోకాల్​లో ఎందుకు చేర్చారన్న తెలంగాణ అడ్వకేట్
  • అది జూరాల నుంచి, మిగతా ప్రాజెక్టులు శ్రీశైలం, సాగర్ ఆధారంగా చేపట్టారన్న గోయల్

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు​ఫోర్ షోర్ నుంచి తెలంగాణ చేపట్టిన ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకే ఏఎంఆర్​పీ నుంచి నీటిని తీసుకోవాలని ఏపీ తరఫు సాక్షి అనిల్ కుమార్ గోయల్ చెప్పారు. ఏఎంఆర్​పీ ద్వారా ఇరిగేషన్​ అవసరాలతో పాటు హైదరాబాద్ సిటీకి తాగునీటిని సరఫరా చేస్తున్నారన్నారు. ఎస్ఎల్​బీసీ పూర్తయితే ఏఎంఆర్​పీ నుంచి నీటిని తీసుకోరాదని చెప్పారు. ఏఎంఆర్​పీగానీ, ఎస్ఎల్​బీసీ గానీ షెడ్యూల్11లోని ప్రాజెక్టుల లిస్టులో లేవన్నారు. ఆ రెండింటినీ ఆన్​గోయింగ్ ప్రాజెక్టులుగా ఎక్కడా పేర్కొనలేదన్నారు. శుక్రవారం కృష్ణా ట్రిబ్యునల్​లో అనిల్ కుమార్​ గోయల్​ను తెలంగాణ అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.

అఫిడవిట్​లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు స్టేట్​మెంట్లు చేశారా? అని అడ్వకేట్ ప్రశ్నించగా.. అదేం లేదన్నారు. మరి షెడ్యూల్ 11లో లేనప్పుడు నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​ను ఆపరేషన్ ప్రొటోకాల్​లో ఎందుకు చేర్చారని వైద్యనాథన్ ప్రశ్నించారు. నెట్టెంపాడు లిఫ్ట్ స్కీమ్​ను జూరాల అప్​స్ట్రీమ్ ఆధారంగా చేపట్టారని ఏకే గోయల్ అన్నారు. దేని ఆధారంగా నెట్టెంపాడును ప్రొటోకాల్​లో చేర్చారని ప్రశ్నించగా.. ఏపీ స్టేట్​మెంట్ ఆఫ్ కేస్, షెడ్యూల్​11లోని ప్రాజెక్టుల ఆధారంగా చేర్చినట్టు గోయల్ పేర్కొన్నారు. షెడ్యూల్ 11 ప్రాజెక్టుల్లో నెట్టెంపాడు ఉన్నా

.. 811 టీఎంసీల కోటాలో ఆ ప్రాజెక్టుకు కేటాయింపులు లేవన్నారు. షెడ్యూల్11లోని ఇతర ప్రాజెక్టులకు ఆ కోటాలో కేటాయింపులున్నాయా? అని ప్రశ్నించగా.. లేవన్నారు. మరి ఒక్క నెట్టెంపాడునే ఎందుకు ప్రొటోకాల్​లో చేర్చారని తెలంగాణ అడ్వకేట్ ప్రశ్నించారు. దీంతో షెడ్యూల్ 11లోని మిగతా ప్రాజెక్టులన్నీ శ్రీశైలం, నాగార్జునసాగర్​ ఆధారంగా చేపట్టినవని, ఒక్క నెట్టెంపాడు మాత్రమే జూరాల నుంచి చేపట్టిన ప్రాజెక్ట్ అని గోయల్​ పేర్కొన్నారు.  

సాగర్​పై భారం తగ్గుతుంది..  

గోదావరి నుంచి 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా ఆ మేరకు నాగార్జునసాగర్​పై భారం తగ్గుతుందని అనిల్ కుమార్ గోయల్ చెప్పారు. గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా సాగర్​లో మిగిలిన నీటిని విభజన చట్టం 11వ షెడ్యూల్​లోని ప్రాజెక్టులకు కేటాయింపులు చేసుకోవచ్చని చెప్పారు. గోదావరి నుంచి 80 టీఎంసీలు తరలించాక.. అదనంగా 45 టీఎంసీల జలాలు ఉమ్మడి ఏపీలో అందుబాటులో ఉన్నాయి కదా? అని తెలంగాణ అడ్వకేట్ ప్రశ్నించగా.. అది తన పరిధిలో లేదని, సంబంధిత ట్రిబ్యునల్ సెటిల్ చేయాలని గోయల్ బదులిచ్చారు.

1978 ఆగస్టు 4న జరిగిన వివిధ రాష్ట్రాల సీఎంల మీటింగ్​లో అదనపు 45 టీఎంసీల జలాల వాడకంపై చర్చ జరిగిందని, కానీ, ప్రస్తుతం షెడ్యూల్ 11లో పేర్కొన్న ప్రాజెక్టుల గురించి నాటి సమావేశంలో చర్చ జరగలేదు కదా? అని అడ్వకేట్ ప్రశ్నించారు. ఆ మీటింగ్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిందని, కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో గోదావరి నుంచి నీటిని తీసుకునే ప్రాంతం.. ఆ నీటిని తరలించే ప్రాంతం ఏపీలోనే ఉన్నాయి కాబట్టి ఆ అదనపు 45 టీఎంసీలు ఏపీకే చెందాలని గోయల్ చెప్పారు. కాగా, సాక్షి క్రాస్ ఎగ్జామినేషన్ శుక్రవారంతో పూర్తయింది.

తదుపరి ఎలాంటి క్రాస్​ ఎగ్జామినేషన్​లు లేవని ట్రిబ్యునల్ పేర్కొంది. ట్రిబ్యునల్ విచారణను లేట్ చేసేందుకు ఏపీ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు చేస్తున్నదని తెలంగాణ సమర్పించిన మధ్యంతర అఫిడవిట్​పై రిప్లై ఇచ్చేందుకు ఏపీకి రెండు వారాల గడువిచ్చింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 16వ తేదీకి వాయిదా వేసింది.