అప్సరను తెల్లవారుజామున ఇలా చంపాడు.. గూగుల్ వెతికి మర్డర్ ప్లాన్

పూజారి సాయి కృష్ణ..  భక్తురాలు అప్సరను హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రోజు ఏం జరిగింది అనే విషయంపై పోలీసులు క్లారిటీ ఇచ్చేశారు. ఎక్కడకు తీసుకెళ్లాడు.. ఎలా చంపాడు అనేది సీన్ టూ సీన్ వివరించేశారు. ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. 

పెళ్లి చేసుకోవాలని అప్సర బ్లాక్ మెయిల్ :

ఏడాది కాలంలో సాయి కృష్ణ – అప్సర మధ్య పరిచయం ఉంది. బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే వీరి ప్రేమ చిగురించింది. 2022, నవంబర్ లో గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం, ద్వారక టూర్ వెళ్లారు ఇద్దరూ. అప్పటి నుంచి బంధం బలపడింది. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా తన ప్రేమను వ్యక్తం చేసింది అప్సర. ఆ ప్రేమ వివాహేతర బంధానికి దారి తీసింది. దీంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది అప్సర. పెళ్లి చేసుకోకపోతే రోడ్డుకు ఈడుస్తానని.. అల్లరిపాలు చేస్తానని.. గొడవ చేస్తానంటూ బెదిరించింది. పెళ్లి కోసం సాయికృష్ణను బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టింది అప్సర.

గూగుల్ వెతికి.. మర్డర్ ప్లాన్ :

అప్సరను ఎలాగైనా చంపాలని డిసైడ్ అయిన సాయికృష్ణ.. గూగుల్ లో "How to Kil human being అంటూ సెర్చ్ చేసి ప్లాన్ వేశాడు. కొన్ని రోజులపాటు ఈ విధంగా సెర్చ్ చేసి.. అప్సరను చంపటానికి ఓ పక్కా ప్రణాళిక రచించాడు. 

సీన్ టూ సీన్ .. ఇలా చంపాడు :

కొన్ని రోజులుగా కోయంబత్తూరు తీసుకెళ్లాలని సాయి కృష్ణను కోరుతుంది అప్సర. టైం లేకపోవటంతో తీసుకెళ్లలేదు. ఇప్పుడు అదే కోయంబత్తూరు టూర్ అడ్డుపెట్టుకుని.. జూన్ 3వ తేదీ రాత్రి 9 గంటల బస్సుకు.. కోయంబత్తూరు టికెట్ బుక్ చేసినట్లు నమ్మింది.. ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు సాయికృష్ణ. నిజమే అనుకున్న అప్సర.. జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల 15 నిమిషాల సమయంలో సరూర్ నగర్ వచ్చి.. సాయికృష్ణ కారు ఎక్కింది. తొమ్మిది గంటలకు శంషాబాద్ చేరుకున్నారు. అక్కడ అసలు విషయం చెప్పాడు.. కోయంబత్తూరు టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. 

కోయంబత్తూరు టూర్ లేదని.. గోశాలకు వెళదామని అప్సరను ఒప్పించాడు సాయికృష్ణ. మధ్యలో డిన్నర్ కోసం రాళ్లగూడ దగ్గర ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆగారు. అక్కడి నుంచి అర్థరాత్రి 12 గంటలకు సుల్తాన్ పల్లిలోని గోశాలకు చేరుకున్నారు. అక్కడ కొంత సమయం ఉండి.. తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాలకు ఆ పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్స్ లోకి వెళ్లారు. 

అప్పటికే తెల్లవారుజాము కావటంతో.. కారు ముందు సీట్లోనే అప్సర నిద్ర పోయింది. బాగా నిద్రపోతుందని గుర్తించిన సాయికృష్ణ.. ఆమె తలపై బలమైన కర్రతో కొట్టి చంపేశాడు. చనిపోయినట్లు నిర్థారించుకున్న తర్వాత.. కారులోని అప్సర డెడ్ బాడీతోనే.. సరూర్ నగర్ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత గుడి వెనక.. తాహశీల్దార్ ఆఫీసు వెనక భాగంలోని మ్యాన్ హోల్ లో అప్సరను పెట్టి.. ఆ పైన మట్టిపోసి.. ఆ తర్వాత చక్కగా సిమెంట్ చేశాడు.. 

అప్సరను.. సాయికృష్ణ ఎలా చంపాడు అనేది పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో ఈ విధంగా స్పష్టం చేశారు.