
అమరావతి: 2 నెలల తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. 436 రూట్లలో 1683 బస్సులు ప్రారంభమైనట్లు తెలిపారు అధికారులు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రయాణికులకు చెబుతున్నామన్నారు. డ్రైవర్లు, ఇతర సిబ్బందిని పరీక్షలు చేసిన తర్వాతే విధుల్లోకి అనుమతిచ్చామని, దూరాప్రాంతలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. దూర ప్రయాణాలు చేసే వారికి బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆన్‌లైన్ రిజర్వేషన్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వారు బస్సుల్లో ప్రయాణించవద్దని అధికారులు తెలిపారు. ప్రయాణికులు బస్సులో ఎక్కేముందు చేతులు శుభ్రపరుచుకునేలా శానిటైజర్లను ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, మాస్క్‌లు తెచ్చుకోని వారు.. బస్ డిపోల్లోని స్టాల్స్‌లో కొనుగోలు చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. వివిధ వర్గాల వారికి కల్పిస్తున్న రాయితీ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, మీడియాతో సహా అన్ని వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. లాక్ డౌన్ లో ఆర్టీసికి సుమారు 1200 కోట్ల మేర నష్టం వచ్చిందని తెలిపింది ఏపీఎస్ ఆర్టీసీ.