పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయానికి ఏపీ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. ఈ క్రమంలోనే వారు ప్రైవేట్ వాహనాలు.. లేదా కార్ రెంట్ కు తీసుకోవడం వల్ల అధిక ఖర్చుతో వెళ్లాల్సి వస్తుంది. దీన్ని అర్థం చేసుకున్న ఆర్టీసీ తూర్పుగోదావరి జిల్లా అరుణాచలేశ్వర ఆలయానికి బస్సులు నడపాలని నిర్ణయించుకున్నారు.
సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో కాకినాడ జిల్లా ఆర్టీసీ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సును నడపాలని నిర్ణయించారు. అరుణాచలేశ్వర ఆలయాన్ని సందర్శించిన తర్వాత ప్రయాణికులు ఒక రోజులో వారి ఇళ్లకు తిరిగి రావడానికి ఇది సహాయపడుతుంది.
జూలై 19న ప్రత్యేక బస్సు ప్రారంభం కానుందని.. కాకినాడ జిల్లా శివారులోని తుని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయలుదేరుతుందని డిపో మేనేజర్ టి.కిరణ్ కుమార్ తెలిపారు. ప్రయాణంలో విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం, శ్రీ కాళహస్తీశ్వరాలయం, కాణిపాకం వినాయక దేవాలయం, తమిళనాడులోని స్వర్ణ దేవాలయం, అరుణాచలేశ్వర దేవాలయం వంటి ఆరు ఆలయాల్లో బస్సు ఆగుతుందని తెలిపారు.
గిరి ప్రదక్షిణ వరకు ఆర్టీసీ బస్సు అక్కడే ఉంటుంది. ఇది కంచి దివ్య క్షేత్రాన్ని కూడా సందర్శిస్తుంది. ఈ ఆరు దర్శనాల అనంతరం ఆర్టీసీ బస్సు తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంటుంది. ఈ సూపర్ లగ్జరీ బస్సు ధర ఒక్కొక్కరికి 3500. ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని సౌకర్యవంతమైన సురక్షితమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బస్సుకు సరిపడా ప్రయాణికులు ఉంటే మిగిలిన ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆ ప్రాంతానికి మరో ట్రిప్పు వేస్తామని అధికారులు తెలిపారు.