ప్రపంచ క్రికెట్ లో అగ్ర శ్రేణి జట్లలో ఆస్ట్రేలియా ఒకటి. వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ అనగానే ఆస్ట్రేలియాకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. ద్వైపాక్షిక సిరీస్ లు ఎలా ఆడినా వరల్డ్ లో తమలోని మరో కోణాన్ని చూపిస్తారు. ఐసీసీ ట్రోఫీలంటే ఈజీగా గెలిచే ఆస్ట్రేలియా మరో ట్రోఫీపై కన్నేసింది. ప్రస్తుతం వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లోనూ టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. గ్రూప్ దశలో ఇంగ్లాండ్ మినహాయిస్తే ఆస్ట్రేలియాకు పెద్దగా పోటీ లేదు. అయితే ఒమన్ కెప్టెన్ అకిబ్ ఇలియాస్ ఆస్ట్రేలియా జట్టుకు బయపడమని చెప్పుకొచ్చాడు.
వరల్డ్ కప్ లో భాగంగా రేపు ఆస్ట్రేలియా, ఓమన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 6 గంటలకు జరుగుతుంది. బార్బడోస్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ టోర్నీలో ఆసీస్ కు ఇదే తొలి మ్యాచ్ కాగా.. ఓమన్ నమీబియాతో తమ తొలి మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ కు ముందు పసికూన ఓమన్ జట్టు ఆసీస్ జట్టును అడ్డుకోవడం దాదాపు అసాధ్యమే. తీవ్ర ఒత్తిడిలో ఉన్నా.. ఒమన్ కెప్టెన్ అకిబ్ కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. ఆసీస్ జట్టుకు గట్టిపోటీ ఇస్తామని చెప్పుకొచ్చాడు.
గొప్ప జట్టుతో పోటీ పడగలమని.. స్పిన్ తో ఆసీస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని.. ఇలియాస్ అన్నాడు. ఆస్ట్రేలియపై మైండ్ గేమ్ ఆడతామని.. ప్రధాన ఈవెంట్ లో వారి రికార్డు గొప్పగా ఉన్నా లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ ఆడటంలో వారు బలహీనమని గుర్తు చేశాడు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఓమన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నమీబియా ఒకే గ్రూప్ లో ఉన్నాయి.