- కారులో వెళ్తున్న వారిపై దాడి
- మహిళలపై దురుసుగా ప్రవర్తన
నిజామాబాద్: పోలీస్ కమిషనరేట్ సాక్షిగా ఖాకీలు వీరంగం చేసారు. జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్ మద్యం మత్తులో ఓ కుటుంబంపై దాడి చేసి హల్ చల్ చేశాడు. నిన్న రాత్రి ఏఆర్ కానిస్టే బుల్ ఆయూబ్ స్కూటీపై వెళ్తుండగా అదే టైంలో సాయి తేజ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి కారు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పోలీస్ కమిషనరేట్ గేట్ముందు ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద స్కూటీని కారు వెనుక నుంచి తాకింది. దీంతో ఏఆర్ కానిస్టేబుల్ శివాలెత్తి పోయాడు. కారు నడుపుతున్న వ్యక్తి క్షమాపణ అడుగుతున్నా పట్టించుకోకుండా కిందికి దించి ఎడాపెడా తగిలించాడు.
కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు కూడా దిగి సారీ అని పదే పదే చెప్తున్నా వినకుండా వారిపై దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డాడు. వారి నుంచి బలవంతంగా ఆర్సీ బుక్ తీసుకున్నాడు. ఈ గొడవతో కమిషనరేట్ కార్యాలయం ఎదుటే వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. గొడవ గమనించిన పరేడ్ గ్రౌండ్ వద్ద విధులు నిర్వహిస్తున్న గేట్ కీపర్ వచ్చి అగ్గికి ఆజ్యం పోయడంతో వివాదం మరింత ముదిరింది.
దారినపోయే వ్యక్తులు ఏంత మంది నచ్చజెప్పినా ఇద్దరు ఖాకీలు ఏ మాత్రం లెక్క చేయలేదు. విషయం తెలుసుకున్నా వన్ టౌన్ సీఐ విజయ్ బాబు అక్కడికి చేరుకుని కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. బాధితులు వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యా దు చేశారు.