ఏఆర్ రెహమాన్ సూపర్ కాంబినేషన్

స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాతో భారతదేశ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించిన ఏఆర్ రెహమాన్ తో గుల్జార్ మరోసారి జత కట్టారు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో ‘‘జయ హో’’ పాటతో ఆస్కార్ పంట పండించిన ఏఆర్ రెహమాన్ –గుల్జార్ కాంబినేషన్లో చాలా కాలం తర్వాత ఓ కొత్త పాటతో సంగీత ప్రియులను ఆలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘‘మేరి పుకార్ సునో’’ కోసం సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ తో ప్రసిద్ధ గీత రచయిత గుల్జార్ జతకట్టి రూపొందిస్తున్న ఈ పాటను సోని మ్యూజిక్ అందిస్తోంది. 
వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన దిల్ సే, గురు, సాథియా, జబ్ తక్ హై జాన్.. వంటి అనేక సూపర్ హిట్ పాటలు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ పాటలుగా నిలిచాయి. సంగీత పరంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో మనసును హత్తుకునేలా స్వరాలు సమకూర్చే ఏఆర్ రెహమాన్, జనం గుండెల్లో చెరగని ముద్ర వేసే సాహిత్యాన్ని అందించే గుల్జార్ పాట కోసం సంగీత ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో పాట వస్తున్నట్లు సోని మ్యూజిక్ ఇండియా తన అధికారిక సైట్ లో టీజర్ ను పోస్ట్ చేసింది.