ములుగు జిల్లాలో AR SI ఆత్మహత్య.. భార్య గవర్నమెంట్ ఉద్యోగి

ములుగు జిల్లాలో AR SI ఆత్మహత్య.. భార్య గవర్నమెంట్ ఉద్యోగి

ములుగు జిల్లా: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో విషాద ఘటన జరిగింది. నర్సయ్య అనే AR SI ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారంలో ఏ.ఆర్. ఎస్సైగా నర్సయ్య విధులు నిర్వహిస్తున్నాడు. నర్సయ్య భార్య సునీత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.

కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థల వల్ల నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నాడని, నర్సయ్య భార్యపై చర్యలు తీసుకోవాలని అతని బంధువులు డిమాండ్ చేశారు.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, అభిప్రాయ భేదాల కారణంగా ఆత్మహత్యలు పెరిగిపోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎక్కువగా నిరక్షరాస్యులైన భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. అయినా వాటికి సర్దుకుపోయి కలిసి ఉండేవాళ్లు. కానీ, ప్రస్తుతం డిగ్రీలు, బీటెక్​, పీహెచ్డీలు చేసి, మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారు.

క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరైతే  ‘నేనేం తక్కువంటే,  నేనేం తక్కువ’ అంటూ ఆధిపత్య ధోరణితో పంతాలకు పోతున్నారు. కానీ, ఈ పద్ధతి మంచిది కాదని,  వివాహ బంధాన్ని నిలబెట్టుకోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తు్న్నారు. ఒకరి కోసం మరొకరు ఆలోచించి  నడుచుకుంటూ బంధాన్ని బలపరుచుకోవాలని హితవు పలికారు.