హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్- నెహ్రు జులాజికల్ పార్క్ మధ్య నిర్మించిన ఫ్లై ఓవర్‌కు ఇటీవల మరణించిన ప్రముఖ ఆర్థిక వేత్త, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టింది. ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌కు మన్మోహన్ సింగ్ ప్లై ఓవర్‌గా నామకరణం చేస్తోన్నట్లు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆరాంఘర్- నెహ్రు జూలాజికల్ పార్క్ మధ్య 4 కిలో మీటర్ల మేర నిర్మించిన ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి 2025, జనవరి 6వ తేదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఫ్లై ఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్లు అనౌన్స్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత పొడవైన పీవీ నర్సింహారావు ఫ్లై ఓవర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించారని.. తాజాగా హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద ఫ్లై ఓవర్‌ను కూడా కాంగ్రెస్ గవర్నమెంటే నిర్మించిందని తెలిపారు. దీంతో మనకు మనమే పోటీ అని మరోసారి నిరూపించుకున్నామన్నారు.
ఆరాంఘర్ ఫ్లై ఓవర్ వివరాలు:
ఆరాంఘర్ నుంచి నెహ్రూ జులాజికల్ జూపార్క్‌వరకు 24 మీటర్ల వెడల్పు, 4.08 కిలోమీటర్ల పొడవు, ఆరు లేన్లతో నిర్మించారు. ఇది నగరంలో అతిపెద్ద రెండో ఫ్లైఓవర్ స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో జూపార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టు, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లేవారికి ట్రాఫిక్ఇబ్బందులు తప్పుతాయి. తాడ్బన్, దానమ్మ హట్స్, హసన్ నగర్ జంక్షన్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగాల్సిన పనిలేదు. జూపార్క్‌కు వచ్చే సందర్శకులు, పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం ఈజీ అవుతుంది.
ALSO READ | ఐదుగురు సీఎంలు చేయని పని రేవంత్ రెడ్డి చేస్తుండు: MP అసదుద్దీన్ ఒవైసీ