
టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి రాజకీయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జన సైనికులకు షాకిస్తూ పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరు జనసేన అభ్యర్థి యనమల భాస్కర్ రావును తప్పిస్తూ.. ఆ స్థానాన్ని మరొకరికి కేటయించారు. వైసీపీ నేతలకు అత్యంత సన్నిహితుడు, ముక్కావారిపల్లె గ్రామ సర్పంచ్ అయిన అరవ శ్రీధర్‌ను రైల్వేకోడూరు అభ్యర్థిగా పవన్ ప్రకటించారు.
వాస్తవానికి రైల్వే కోడూరు అభ్యర్థిగా తొలుత యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. అనంతరం క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. అరవ శ్రీధర్ పేరును ఖరారు చేశారు. శ్రీధర్ మూడు జుల కిందటే తన అనుచరులతో జనసేన పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లె గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు.
మండలి బుద్దప్రసాద్‌కు అవకాశం
మరోవైపు, కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్యెల్యే టిక్కెట్‌ను మండలి బుద్దప్రసాద్ కు కేటాయిస్తున్నట్లు జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసినది. బుద్దప్రసాద్ కొన్ని రోజుల కిందటే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోచేరారు.