బీజేపీ దారి తప్పుతుంటే ఆర్ఎస్ఎస్ ఏంచేస్తోంది.. అర్వింద్ కేజ్రీవాల్

బీజేపీ దారి తప్పుతుంటే ఆర్ఎస్ఎస్ ఏంచేస్తోంది.. అర్వింద్ కేజ్రీవాల్
  • మోహన్ భగవత్​ను ప్రశ్నించిన అర్వింద్ కేజ్రీవాల్
  • మోదీ కుట్రపూరిత రాజకీయాలపై ఎందుకు మాట్లాడడం లేదు
  • ‘జనతా కీ అదాలత్’ మీటింగ్​లో ఆప్ నేషనల్ కన్వీనర్​ ఫైర్

న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ పుట్టిందని, ఆ పార్టీ దారితప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్​పైనే ఉందని ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రధానమంత్రి మోదీ అవకాశవాద, కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. ‘‘కొడుకు దారితప్పుతుంటే.. తల్లిదండ్రులే అతన్ని దారిలో పెడ్తారు. కానీ.. ఇప్పుడు ఆ కొడుకే.. తల్లిదండ్రులను ఎదిరించే స్థాయికి ఎదిగాడా?’’అని మోదీని ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ విమర్శించారు.

‘జనతా కీ అదాలత్’ పేరుతో ఆప్ నేతలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ సింబల్ చీపుర్లు, జెండాలను కార్యకర్తలు ప్రదర్శించారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. ‘‘బీజేపీ దారితప్పుతుంటే ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నది? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్​కు నేను గౌరవంగా ఐదు ప్రశ్నలు అడగాలనుకుంటున్న.. దర్యాప్తు సంస్థలతో అపోజిషన్ పార్టీ నేతలను తప్పుడు కేసుల్లో బీజేపీ ఇరికిస్తున్నది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడ్తున్నది. అవినీతిపరులైన నేతలను తన గుప్పిట్లో తెచ్చుకుంటున్నది. ఈ తరహా రాజకీయాలను ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తుందా?’’అని కేజ్రీవాల్ అన్నారు.

ఆర్ఎస్ఎస్​ను ఎదిరించిన నడ్డాపై చర్యలు ఎందుకు తీసుకోలే?

‘‘75 ఏండ్ల తర్వాత నేతలు రిటైర్ అవుతారని ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి రూల్ తీసుకొచ్చాయి. ఈ రూల్ ప్రధాని మోదీకి వర్తించదని కేంద్రమంత్రి అమిత్ షా అంటున్నరు. పార్టీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కల్​రాజ్​కు వర్తించిన రూల్‌‌‌‌.. మోదీకి ఎందుకు వర్తించదు? లోక్‌‌‌‌సభ ఎన్నికల టైమ్​లో తనకు ఆర్ఎస్ఎస్ మద్దతు అవసరం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీజేపీ అంతగా ఎదిగిపోయిందా? మాతృ సంస్థపై అసహనాన్ని ప్రదర్శించిన జేపీ నడ్డాపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆయన చేసిన కామెంట్లు మీకు బాధకలిగించలేదా? దేశంలో బీజేపీ చేస్తున్న ‘రాజకీయాలు’ మీకు సంతృప్తి కలిగిస్తున్నాయా?’’అని కేజ్రీవాల్ అన్నారు.

నాకు సొంతిళ్లు లేదు: కేజ్రీవాల్

దసరా నవరాత్రుల్లో సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తానని అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రజలే తనకు వసతి కల్పిస్తున్నారని, అందులోనే ఉంటానని తెలిపారు. తనకంటూ సొంతిళ్లు లేదన్నారు. ‘‘ప్రధాని మోదీ నన్ను, మనీశ్ సిసోడియా అవినీతిపరుడని నిరూపించేందుకు కుట్ర పన్నారు. ఆప్‌‌‌‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. సీఎం కుర్చీపై దాహం లేకపోవడం వల్లే రాజీనామా చేశా. డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. దేశ రాజకీయాలను మార్చేందుకు వచ్చాను’’అని కేజ్రీవాల్ అన్నారు.