- సర్కారు అనుమతి లేకుండానే తాజాగా ముగ్గురు కన్సల్టెంట్లు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఇష్టారాజ్యంగా కన్సల్టెంట్ల నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఉండగా, నెల రోజుల్లోనే మరో ముగ్గురిని తీసుకున్నారు. ఇంకో ఇద్దరినీ తీసుకునేందుకు కౌన్సిల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని వర్సిటీల్లో ఎలాంటి నియామకాలు చేపట్టొద్దని గతంలోనే సర్కారు ఆదేశాలు జారీచేసింది.
అదే రూల్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌కూ వర్తిస్తుంది. అయితే, ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే గత 20 రోజుల్లో అధికారులకు నచ్చిన ముగ్గురిని తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అకాడమిక్ కన్సల్టెంట్లుగా రమేశ్ బాబు, రాజేశ్వర్ మిట్టపల్లిని, రాధాకృష్ణన్ ను ఓఎస్డీగా నియమించారు. కన్సల్టెంట్లకు నెలకు రూ.55వేల చొప్పున, ఓఎస్డీకి రూ.1.05 లక్షల వేతనం ఇస్తామని ఆర్డర్స్ లో టీజీసీహెచ్ఈ అధికారులు పేర్కొన్నారు. అయితే, కౌన్సిల్ లో ఓఎస్డీ పోస్ట్ లేకున్నా.. కొత్తగా క్రియేట్ చేసి నియమించడంపై విమర్శలు వస్తున్నాయి.
అధికారిక నోటిఫికేషన్ లేకుండానే..
కౌన్సిల్లో ఇప్పటికే ముగ్గురు కన్సల్టెంట్స్ ఉన్నారు. ప్రస్తుతం సదానందం, శరభయ్య, అన్నపూర్ణ కొనసాగుతున్నారు. దీంట్లో కన్సల్టెంట్ అన్నపూర్ణను గతంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాల మేరకు నియమించినట్టు అధికారులు చెప్తున్నారు. ఎన్ఎస్ఎస్, యాంటీ డ్రగ్స్, ఇతర వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తారు. అయితే, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి ఎన్ఎస్ఎస్ విభాగాన్ని కళాశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు నవీన్ మిట్టల్ ఉన్నప్పుడే అటాచ్ చేశారు. కాగా, అన్నపూర్ణను కౌన్సిల్ ద్వారా నియమించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అవసరాలుంటే.. అధికారికంగా నోటిఫికేషన్ జారీచేసి, అర్హులైన వారి నుంచి అప్లికేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని, వారిలోంచి ఎంపిక చేయాలని, ఇలా తెలిసిన వారిని నియమించుంటూ పోతే కౌన్సిల్‌కు చెడ్డపేరు వస్తుందని విద్యావేత్తలు, ప్రొఫెసర్లు అంటున్నారు. అయితే, కౌన్సిల్ స్వయం ప్రతిపత్తి సంస్థ అని, అవసరాలకు తగ్గట్టుగా నియమకాలు చేసుకొని.. తర్వాత కౌన్సిల్ సమావేశంలో రాటిఫై చేయించుకుంటామని కౌన్సిల్ అధికారులు చెప్తుండడం గమనార్హం.