అడ్డగోలుగా స్కానింగ్​లు .. కామారెడ్డిలో ప్రైవేట్​ ఆస్పత్రుల వ్యవహారం 

అడ్డగోలుగా స్కానింగ్​లు .. కామారెడ్డిలో ప్రైవేట్​ ఆస్పత్రుల వ్యవహారం 
  • ఆడపిల్ల అని తేలితే అబార్షన్​

కామారెడ్డి​ ​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఇష్టారాజ్యంగా లింగ నిర్ధారణ టెస్టులు కలకలం రేపుతున్నాయి. జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచీ నిత్యం ప్రజలు స్కానింగ్​ కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే.. అబార్షన్​ చేస్తున్నారు. మరోవైపు అధికారుల తనిఖీలు, పట్టింపు లేకపోడంతో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహణ ఇష్టార్యాజ్యంగా సాగుతోంది.  సెంటర్లలో ఏర్పాటు చేసే పరికరాలకు సంబంధించి నిర్వాహకులు మోసాలకు  పాల్పడుతున్నారు. ఒకరకమైన యంత్రాలకు అనుమతి తీసుకొని స్కానింగ్​  యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.  కొన్ని చోట్ల సరైన డాక్టర్లు లేకుండానే ఆస్పత్రులను నిర్వహిస్తున్న దాఖాలు ఉన్నాయి. ఇటీవల పట్టణంలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. 

ఇటీవల కామారెడ్డిలో సమన్విత హాస్పిటల్​లో ఓ యువతికి 8 నెలలకే డెలివరీ చేయటమే కాకుండా పుట్టిన ఆడ బిడ్డను హాస్పిటల్​ నిర్వాహకులు అమ్మేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కలెక్టర్​ ఆదేశాలతో వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీసర్లు తనిఖీలు చేసి, ఆస్పత్రిని సీజ్​చేశారు. తనిఖీల్లో భాగంగా రూల్స్​ కు విరుద్ధంగా ఆస్పత్రి నడుపుతున్నట్టు తేలింది. ఒకరకం   మెషీన్​ పర్మిషన్​ తీసుకొని, వేరే రకం మిషన్​ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆస్పత్రిలో అబార్షన్లు కూడా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

తనిఖీలు నామమాత్రం

 ప్రైవేట్​ హాస్పిటల్స్​లో హెల్త్​ డిపార్మెంట్​ ఆఫీసర్లు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి 3 నెలలు, 6 నెలలకొసారి తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఏడాదికోసారి కూడా ఇటు వైపు కన్నేత్తి చూడట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినప్పుడు, ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే తనిఖీ చేసి మమ అనిపిస్తున్నారు.   

మారని తీరు..

జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో లింగ నిర్దారణ టెస్టులు బహిరంగంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 2021లో శ్రీరాంనగర్ కాలనీలోని కౌసల్య హాస్పిటల్​లో లింగ నిర్ధారణ టెస్టులు చేయడంతో స్టేట్​ టీమ్​ సభ్యులు పేషెంట్ల లాగా వెళ్లి ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు. నిర్వాహకుల పై  కేసు నమోదు చేసి, హాస్పిటల్​ను సీజ్​ చేశారు. అదే యజమాన్యం కొద్ది నెలల తర్వాత సమన్విత పేరుతో కొత్త హాస్పిటల్​ను ప్రారంభించింది. మళ్లీ ఈ హాస్పిటల్​లో కూడా అలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.

జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ టెస్టుల కోసం చుట్టూ పక్కల ఏరియాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, మహారాష్ర్ట, కర్నాటక బార్డర్​ నుంచి గర్భవతులు వస్తున్నారు.  లింగ నిర్ధారణ టెస్టుల వివరాల్ని బయటకు వెళ్లడించకూడదు. కొందరు ఆ వివరాలు చెబుతుండటంతో ఆడ పిల్ల అని తేలితే అబార్షన్​ చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి, స్కానింగ్​లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

అనుమతులు లేకున్నా స్కానింగ్​!

జిల్లాలో మొత్తం 127 ప్రైవేట్ హాస్పిటల్స్​ ఉన్నాయి. ఇవి క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్ యాక్ట్ ప్రకారం పర్మిషన్​ పొందిన హాస్పిటల్స్​. కామారెడ్డి డివిజన్​లోనే 90 ఆస్పత్రులు ఉండగా.. స్కానింగ్ పర్మిషన్​ పొందినవి 9 వరకే ఉన్నాయి. కానీ, పర్మిషన్​ లేకుండా చాలా ఆస్పత్రుల్లో స్కానింగ్​లు చేస్తున్నారు. రూల్స్​కు విరుద్ధంగా హాస్పిటల్స్​ను నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహారిస్తున్నారు. హాస్పిటల్​లో స్కానింగ్​ చేసేందుకు వాడే యంత్రాలకు తప్పనిసరి పర్మిషన్​ ఉండాలి.